North Korea: తొలిసారిగా నిఘా ఉపగ్రహాన్ని ప్రయోగించిన ఉత్తర కొరియా

ఉత్తర కొరియా తొలిసారిగా నిఘా ఉపగ్రహాన్ని భూకక్ష్యలోకి ప్రవేశపెట్టింది. దీనికి రష్యా సహకారం తీసుకున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది.

Updated : 22 Nov 2023 04:53 IST

సియోల్‌: తరచూ బాలిస్టిక్‌ క్షిపణులను (Ballistic Missile) ప్రయోగిస్తూ శత్రు దేశాలను హెచ్చరించే ఉత్తర కొరియా (North Korea).. తాజాగా తమ దేశ రక్షణ చర్యల్లో మరో ముందడుగు వేసింది. తొలిసారిగా ఒక నిఘా ఉపగ్రహాన్ని(Spy Satellite) భూకక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా, జపాన్‌ నిర్థరించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఈ ఉపగ్రహం రూపకల్పనలో రష్యా నుంచి ఉత్తరకొరియా సాంకేతిక సహకారం తీసుకున్నట్లు సమాచారం. కొరియన్‌ పెనిన్సులా, చైనా మధ్య ఉన్న సముద్రం మీదుగా ఈ రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లిందని దక్షిణ కొరియా సైనికాధికారులు తెలిపారు. ఈ రాకెట్‌ శకలాలు ఆసియా భూభాగంలోనే పడే అవకాశాలున్నాయన్నారు. 

గతంలో రెండు సార్లు నిఘా ఉపగ్రహాన్ని భూకక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు కిమ్‌ ప్రభుత్వం విఫలయత్నం చేసింది. ఈ సారి రష్యా సహకారంతో ప్రయోగాన్ని విజయవంతం చేసింది. దీంతో దక్షిణ కొరియా, జపాన్‌, అమెరికా దేశాలు తమ సైన్యాన్ని అప్రమత్తం చేశాయి. అమెరికా, దక్షిణ కొరియా సైనిక కార్యకలాపాలను గమనించడంతోపాటు అణ్వస్త్ర సామర్థ్యాలను మెరుగుపర్చుకునేందుకే ఉత్తర కొరియా ఈ రాకెట్‌ ప్రయోగాలు చేస్తోందని న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని