Rwanda Bill: బ్రిటన్‌కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?

అక్రమ వలసలతో సతమతమవుతోన్న బ్రిటన్‌.. వీటికి అడ్డుకట్ట వేసే ‘రువాండా బిల్లు’కు (Safety of Rwanda Bill) ఆమోదం తెలిపింది.

Published : 23 Apr 2024 19:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పెద్దఎత్తున అక్రమ వలసలతో సతమతమవుతోన్న బ్రిటన్‌.. వీటికి అడ్డుకట్ట వేసేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన వివాదాస్పద ‘రువాండా బిల్లు’కు (Safety of Rwanda Bill) పార్లమెంటు ఆమోదం తెలిపింది. దీనిని సమర్థించుకున్న ప్రధానమంత్రి రిషి సునాక్‌ (Rishi Sunak).. అక్రమ వలసదారులను ఆఫ్రికా దేశానికి తరలించేందుకు ఏదీ అడ్డు కాదన్నారు. అంతర్జాతీయ వలసల నిర్వహణలో ఇదో మైలురాయని తెలిపారు. బ్రిటన్‌ రాజు చార్లెస్‌ III ఆమోదం తర్వాత ఇది చట్టరూపం దాల్చనుంది.

‘‘బ్రిటన్‌కు వచ్చే అక్రమ వలసదారులను నిరోధించేందుకు ఈ బిల్లును ప్రవేశపెట్టాం. దీంతో వలసదారులను దోపిడీకి గురిచేసే క్రిమినల్‌ గ్యాంగ్‌ల కార్యకలాపాలకు అడ్డుకట్ట పడుతుంది. ఇకనుంచి దేశంలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించినవారు ఇక్కడ ఉండేందుకు తాజా చట్టం అంగీకరించదు. ఇక మా దృష్టి వారిని విమానాల్లో తరలించడం పైనే. దీనికి ఇప్పుడు ఏదీ అడ్డుకాదు’’ అని సునాక్‌ పేర్కొన్నారు.

ఏమిటీ బిల్లు..?

బ్రిటన్‌లోకి అక్రమ వలసలు పెరుగుతున్నట్లు ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి. 2022లోనే 45 వేల మంది వచ్చినట్లు సమాచారం. ఇంగ్లీష్‌ ఛానల్‌ ఈదుతూ, పడవల్లో ప్రమాదకర రీతిలో ప్రయాణిస్తూ వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటివారిని అడ్డుకుంటామని పేర్కొంటున్న బ్రిటన్‌.. రువాండా ప్రణాళికను సిద్ధం చేసింది. కానీ, అక్కడి సుప్రీంకోర్టు నుంచి ఎదురుదెబ్బ తగిలింది. వలసదారులను తరలించగల సురక్షిత దేశంగా రువాండాను పరిగణించలేమని పేర్కొంటూ 2023 నవంబర్‌లో తీర్పు చెప్పింది.

Tobol: జీపీఎస్‌ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?

ఈ క్రమంలోనే భద్రతా రువాండా బిల్లు (Safety of Rwanda Bill)ను బ్రిటన్‌ రూపొందించింది. తద్వారా ఆ ఆఫ్రికా దేశాన్ని సురక్షితంగా పేర్కొంటూ బిల్లుకు ఆమోదం తెలిపింది. తద్వారా అక్రమంగా వచ్చేవారిని 6,400 కి.మీ. దూరంలో రువాండాకు తరలిస్తారు. రాజధాని కిగాలిలో ఏర్పాటుచేసిన శరణార్థి శిబిరాల్లో ఉంచుతారు. ఇందుకోసం ఏప్రిల్‌ 2022లోనే బ్రిటన్‌ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. వలసదారులకు మౌలిక వసతులు ఏర్పాటుచేసేందుకు ఆ దేశానికి ఇప్పటివరకు 290 మిలియన్ల పౌండ్లను చెల్లించింది. త్వరలో మరో 50 మిలియన్‌ పౌండ్లను చెల్లించనున్నట్లు సమాచారం. అక్కడే బ్రిటన్‌లో ఆశ్రయం కోరుకునే వారి దరఖాస్తులను పరిశీలిస్తారు.

విమానాలు సిద్ధం 

ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి కార్యాచరణ ఎలా ఉంటుందన్న విషయాన్ని ప్రధాని రిషి సునాక్‌ వివరించలేదు. ‘అక్రమ వలసదారులను తరలించేందుకు ఛార్టర్‌ విమానాలు సిద్ధంగా ఉన్నాయి. 2,220 మంది వలసదారులు ఉండేందుకు వీలుగా అక్కడ శిబిరాలను ఏర్పాటుచేయనున్నాం. వీరితోపాటు దస్త్రాల పరిశీలనకు 200 మంది శిక్షణ పొందిన సిబ్బందిని నియమిస్తాం. ఏవైనా న్యాయపరమైన వివాదాలు తలెత్తితే.. వాటిని వేగంగా పరిష్కరించేందుకు 25 కోర్టు రూమ్‌లను ఏర్పాటుచేస్తాం. ఇందుకోసం 150 మంది న్యాయమూర్తులను గుర్తించాం’ అని బ్రిటన్ ప్రధాని పేర్కొన్నారు. 10, 12 వారాల్లోనే ఓ రహస్య ప్రాంతం నుంచి ఈ విమానాలు బయలుదేరుతాయన్నారు.

ఐరాస ఆందోళన 

అక్రమ వలసదారులను ఆఫ్రికా తరలించే అంశంపై బ్రిటన్‌ విపక్షాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. మరోవైపు ఐక్యరాజ్యసమితి కూడా తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. ఆశ్రయం కోరుకునేవారిని రువాండా తరలించేందుకు చేస్తున్న ప్రయత్నాలను బ్రిటన్‌ పునఃపరిశీలించాలని సూచించింది. ఇలా చేయడం చట్టవిరుద్ధమని ప్రపంచవ్యాప్తంగా ప్రమాదకర పరిస్థితులకు దారి తీస్తుందని హెచ్చరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని