Israel Hamas Conflict: నెతన్యాహుతో అజిత్‌ డొభాల్‌ భేటీ.. యుద్ధంపై చర్చ

Israel Hamas Conflict: హమాస్‌పై ఇజ్రాయెల్‌ చేస్తున్న యుద్ధం సహా పలు అంశాలపై భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డొభాల్‌ ఆ దేశ ప్రధాని నెతన్యాహుతో చర్చించారు.

Published : 12 Mar 2024 08:22 IST

టెల్‌ అవీవ్‌: జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డొభాల్‌ (Ajit Doval) సోమవారం ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహుతో సమావేశమయ్యారు. హమాస్‌పై గాజాలో జరుగుతున్న యుద్ధం గురించి చర్చించారు. బందీల విడుదల, మానవతా సాయం అందజేత వంటి అంశాలూ ఇరువురి మధ్య చర్చకు వచ్చాయి. డొభాల్‌తో భేటీ, చర్చించిన అంశాలను నెతన్యాహు (Benjamin Netanyahu) కార్యాలయం ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది.

అంతకుముందు.. అక్టోబర్‌ 7 తరహాలో హమాస్‌ మళ్లీ ఇజ్రాయెల్‌పై (Israel Hamas Conflict) దాడి చేసే ప్రమాదం ఉండొద్దని నెతన్యాహు అన్నారు. ఆ లక్ష్యంతోనే యుద్ధం కొనసాగిస్తున్నామని తెలిపారు. ‘హమాస్‌ ఉగ్రవాద ఆర్మీ’ని పూర్తిగా ఏరిపారేస్తామని పేర్కొన్నారు. అందులో భాగంగా రఫాలోనూ సైనిక చర్య ఉంటుందని పునరుద్ఘాటించారు. మరో రెండు నెలల పాటు యుద్ధం కొనసాగుతుందని తెలిపారు. కచ్చితమైన సమయాన్ని మాత్రం వెల్లడించలేదు.

మరోవైపు గాజాపై పోరులో ఇజ్రాయెల్‌ అనుసరిస్తున్న విధానాన్ని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ తప్పుబట్టడంపైనా నెతన్యాహు స్పందించారు. ఇజ్రాయెలీల అభీష్టానికి విరుద్ధంగా తాను సొంత ఎజెండాతో ముందుకు వెళ్తున్నట్లు భావిస్తే అది పొరపాటని వ్యాఖ్యానించారు. నెతన్యాహు విధానాలు సొంత దేశాన్నే గాయపరుస్తున్నాయని బైడెన్ శనివారం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

మరోవైపు తాము ఇప్పటికీ ఇజ్రాయెల్‌తో చర్చలకు సిద్ధంగా ఉన్నామని హమాస్‌ నేత ఇస్మాయిల్‌ హనియే అన్నారు. అయితే, గాజాలో శాశ్వత కాల్పుల విరమణ, అక్కడి నుంచి ఇజ్రాయెల్‌ బలగాల ఉపసంహరణే అసలైన పరిష్కారమని చెప్పారు. రంజాన్‌ మాసం ప్రారంభానికి ముందే ఇరు పక్షాల మధ్య సంధి కుదుర్చాలని అమెరికా సహా మరికొన్ని దేశాలు కలిసి విఫలయత్నం చేసిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని