Nuclear Water: చైనాలో బిగ్గరగా మాట్లాడకండి.. తమ పౌరులకు జపాన్‌ సూచన!

చైనాలోని జపనీయులు జాగ్రత్తగా ఉండాలని అక్కడి జపాన్‌ దౌత్య కార్యాలయం హెచ్చరించింది. ఫుకుషిమా అణుజలాల విడుదలపై చైనా తీవ్ర ఆగ్రహంగా ఉన్న విషయం తెలిసిందే.

Published : 26 Aug 2023 02:13 IST

టోక్యో: జపాన్‌ (Japan)లో ఫుకుషిమా దైచీ అణు విద్యుత్‌ కేంద్రం (Fukushima Nuclear Plant) నుంచి రేడియోధార్మిక వ్యర్థ జలాలను పసిఫిక్‌లోకి విడుదల చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే, దీనిపై చైనా, దక్షిణ కొరియాల నుంచీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ‘అత్యంత స్వార్థపూరిత, బాధ్యతారాహిత్య చర్య’ అని చైనా అగ్గిమీద గుగ్గిలమవుతోంది. స్థానికంగా నిరసనలూ వెలుగుచూస్తున్నాయి. ఈ పరిణామాల నడుమ జపాన్‌ అప్రమత్తమైంది. చైనాలో నివసిస్తోన్న జపానీయులు జాగ్రత్తగా మసలుకోవాలని సూచించింది. బహిరంగ ప్రదేశాల్లో జపనీస్‌లో గట్టిగా మాట్లాడొద్దని హెచ్చరించింది.

‘బయటకు వెళ్లినప్పుడు అప్రమత్తంగా ఉండండి. అనవసరంగా జపనీస్‌లో బిగ్గరగా మాట్లాడటం వంటివి చేయకండి. జపాన్‌ ఎంబసీ పరిసర ప్రాంతాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి’ అని చైనాలోని జపాన్‌ దౌత్య కార్యాలయం పేర్కొంది. స్థానికంగా మరిన్ని నిరసనలకు అవకాశం ఉందని హాంకాంగ్‌లోని జపాన్‌ కాన్సులేట్‌ తెలిపింది. దక్షిణ కొరియాలోనూ జపాన్‌ పౌరులు జాగ్రత్తగా ప్రవర్తించాలని, అనవసరమైన ఇబ్బందులను నివారించాలనే హెచ్చరికలు జారీ అయ్యాయి. సియోల్‌లోని జపాన్ రాయబార కార్యాలయంలోకి ప్రవేశించిన 16 మంది నిరసనకారులను దక్షిణ కొరియా పోలీసులు గురువారం అరెస్టు చేశారు.

చైనాలో కొవిడ్‌ ఆంక్షలు ఎత్తేసిన 2 నెలల్లో.. 20లక్షల మరణాలు!

2011లో ఫుకుషిమా అణుకేంద్రం సునామీ కారణంగా దెబ్బతిన్న నాటి నుంచి ఈ అణు వ్యర్థ జలాలను జపాన్‌ భారీ ట్యాంకుల్లో నిల్వ చేసింది. ప్రస్తుతం వెయ్యి ట్యాంకుల్లో 13.7 లక్షల టన్నుల రేడియోధార్మిక జలాలు ఉన్నాయి. 2024 మార్చి నాటికి వీటిలో 31,200 టన్నుల జలాలను విడుదల చేయాలన్నది టెప్కో ప్రణాళిక. దీనిలో భాగంగానే గురువారం 200 నుంచి 210 క్యూబిక్‌ మీటర్ల రేడియో ధార్మిక జలాలను శుద్ధి చేసి, సముద్రంలోకి పంపింగ్‌ చేశారు. గురువారం మధ్యాహ్నం సముద్రం నుంచి సేకరించిన నీటి నమూనాల్లో.. రేడియోధార్మిక స్థాయిలు సురక్షితమైన స్థాయిల్లోనే ఉన్నాయని ‘టెప్కో’ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని