పాత రాజధాని మునిగిపోతోంది.. కొత్త రాజధానిపై దోమలు దండెత్తాయి..

ఇండోనేసియా (Indonesia)లో నిర్మిస్తున్న నూతన రాజధానికి దోమల బెడద ఎక్కువగా ఉంది. 2025 నాటికి ఇక్కడ 2 కోట్ల మంది నివసిస్తారని అంచనా..అందువల్ల దోమలను నివారించాలని అక్కడి ప్రజలు అభ్యర్థిస్తున్నారు.

Updated : 24 Feb 2023 08:23 IST

జకార్తా: ఇండోనేషియా అనేక దీవుల సమాహారం. ఎక్కువ భాగం అటవీప్రాంతం కావడంతో ఉన్న నేలపై జనాభా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. జావా ద్వీపంలోని రాజధాని జకార్తా ఇప్పటికే ఒకటిన్నర కోటికి పైగా జనాభాతో కిక్కిరిసిపోయింది. మరో పక్క సముద్రతీరంలోని జకార్తా ఏటా కిందకు కుంగుతోంది. ప్రతి ఏటా కొన్ని సెం.మీ మేర నేల కుంగుతోంది. ఇప్పటికే సగం నగరం సముద్ర మట్టం కన్నా కిందకు దిగడం గమనార్హం. వాతావరణ మార్పులతో సముద్ర మట్టం పెరగడంతో నగర తీరప్రాంతం ఇప్పటికే సముద్రంలో మునిగింది.

భూగర్భజలాల తోడివేత

వానలు భారీగా కురిసినా సరైన నీటి సంరక్షణ విధానాలు లేకపోవడంతో ప్రజలు భూగర్భజలాలను బోర్ల ద్వారా తోడివేస్తున్నారు. నగరం కిందకి దిగిపోయేందుకు ఇది ప్రధాన కారణమని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. దీంతో కొన్నేళ్ల క్రితం కొత్త రాజధానిని ఏర్పాటు చేయాలని తీర్మానించారు. అందులో భాగంగానే కలిమంటన్‌ ద్వీపంలోని నుసన్‌తార ప్రాంతాన్ని ఎంపిక చేశారు.

ఇక్కడ దోమల భయం..

అంతా బాగానే ఉంది. అనుకున్నట్టుగానే నగర నిర్మాణం ప్రారంభమైంది.  దీనికి బిలియన్ల డాలర్ల ధనాన్ని వెచ్చిస్తున్నారు. 2024 కల్లా దీన్ని పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఈ ప్రాంతం ఉష్ణమండల అటవీప్రాంతంలో ఉంది. వేల సంవత్సరాలుగా అడవులుండటంతో దోమల బెడద తీవ్రంగా ఉంది. ఈ దోమలతో మలేరియా, డెంగీ,ఫైలేరియా... తదితర వ్యాధులు ప్రబలుతున్నాయి. 2045 కల్లా నూతన రాజధానిలో కనీసం రెండు కోట్ల మంది నివసిస్తారని ఒక అంచనా. నగర నిర్మాణం కోసం అటవీప్రాంతాలను నిర్మూలించడంతో అక్కడ ఉండే దోమలు నగర ఆవాసాలను తమ నివాసాలుగా మార్చుకుంటున్నాయి. దీంతో అనేక వ్యాధులు వస్తున్నాయి. అయితే  ఈ సమస్యలన్నింటీని పరిష్కరిస్తామని అధికారులు చెబుతున్నారు. మొదట దోమల బెడద నివారిస్తే అదే పదివేలని ప్రజలు అభ్యర్థిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని