Russia: అందుకే.. చైనాతో బంధం మరింత బలోపేతం!

పాశ్చాత్య దేశాల ఒత్తిడి కారణంగానే చైనా(China)తో తమ సంబంధాలు మరింత బలోపేతం అవుతున్నాయని రష్యా (Russia) పేర్కొంది.

Published : 24 May 2023 18:28 IST

బీజింగ్‌: ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దురాక్రమణ (Russia Invasion) ప్రభావం ప్రపంచవ్యాప్తంగా పలు రంగాలపై పడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రష్యా-చైనా మధ్య సాన్నిహిత్యం మరింత పెరుగుతోందనే వాదన కూడా ఉంది. పాశ్చాత్య దేశాల ఒత్తిడి వల్లే చైనా(China)తో తమ సంబంధాలు మరింత బలోపేతం అవుతున్నాయని రష్యా వెల్లడించింది. చైనా పర్యటనలో ఉన్న రష్యా ప్రధానమంత్రి మిఖాయిల్‌ మిషుస్టిన్‌ (Mikhail Mishustin).. చైనా ప్రీమియర్‌ లీ కియాంగ్‌తో భేటీ అయిన తరుణంలో ఈ విధంగా మాట్లాడారు.

ఉక్రెయిన్‌పై యుద్ధం మొదలుపెట్టిన తర్వాత రష్యాపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించడం ప్రారంభించాయి. తద్వారా రష్యా దూకుడుకు అడ్డుకట్ట వేయాలని ప్రయత్నిస్తున్నాయి. దీంతో ఆర్థిక, దౌత్య మద్దతు కోసం చైనాపై ఆధారపడుతోన్న రష్యా.. ఉన్నతస్థాయి ప్రతినిధులతో పర్యటనలను కొనసాగిస్తోంది. ఈ క్రమంలో తాజాగా చైనాలో పర్యటించిన రష్యా ప్రధానమంత్రి మిఖాయిల్‌ మిషుస్టిన్‌.. చైనా ప్రధానితో చర్చలు జరిపారు. అయినప్పటికీ ఉక్రెయిన్‌పై దాడి గురించి ఒక్కమాట కూడా మాట్లాడలేదు. కేవలం అంతర్జాతీయ స్థాయిలో అమెరికా ఆధిపత్యానికి అడ్డుకట్టవేయడంపైనే ఇద్దరు దృష్టి పెట్టారు. రెండు దేశాల సంబంధాలపై రష్యా పీఎం మిఖాయిల్‌ మిషుస్టిన్‌ మాట్లాడుతూ.. ‘అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న కల్లోల పరిస్థితులు, పాశ్చాత్య దేశాలన్నీ సామూహికంగా తెస్తున్న ఒత్తిడి ప్రభావంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు ఊహించని స్థాయిలో కొనసాగుతున్నాయి’ అని పేర్కొన్నారు.

మరోవైపు రష్యా, ఉక్రెయిన్‌ విషయంలో తాము తటస్థంగానే ఉంటామని చైనా పేర్కొంది. ఇరు దేశాలకు సహాయం అందించేందుకు తాము సిద్ధమేనని తెలిపింది. ఇదే సమయంలో మాస్కోను అమెరికా రెచ్చగొడుతోందని ఆరోపించింది. రష్యాపై విధిస్తోన్న ఆంక్షలకు వ్యతిరేకంగా మాస్కోతో బలమైన దౌత్య, వాణిజ్య సంబంధాలను కొనసాగిస్తున్నామని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని