Pakistan: గుండెపోటును ప్రేరేపించే ఆహారం, ఇంజెక్షన్లు ఇచ్చారు: ఇమ్రాన్‌ న్యాయవాదుల తీవ్ర ఆరోపణలు

మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌(Imran Khan)ను అరెస్టు అక్రమమని, వెంటనే ఆయన్ను విడుదల చేయాలని పాకిస్థాన్‌(Pakistan) సుప్రీంకోర్టు గురువారం ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన విడుదలైనా.. మరోసారి అరెస్టు చేస్తామని పాక్‌ మంత్రి ఒకరు వెల్లడించడం గమనార్హం. 

Updated : 12 May 2023 16:16 IST

ఇస్లామాబాద్‌: మాజీ ప్రధాని, తెహ్రీక్‌-ఎ-ఇన్సాఫ్‌(పీటీఐ) (Pakistan Tehrik-e-Insaf) పార్టీ అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌(Imran Khan) అరెస్టుతో పొరుగుదేశం పాకిస్థాన్‌(Pakistan)లో ఉద్రిక్త వాతావారణం నెలకొంది. మరోవైపు ఆయన అరెస్టు అక్రమమని పాక్‌ సుప్రీంకోర్టు తేల్చింది. ఈ పరిణామాల మధ్య ఇమ్రాన్ తరఫు న్యాయవాదులు మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన్ను జైల్లోనే హత్య చేసేందుకు కుట్రలు జరిగాయని ఆరోపించారు. 

‘తనను జైల్లో నిద్ర పోనివ్వట్లేదని ఇమ్రాన్‌ చెప్పారు. టాయిలెట్‌, బెడ్‌లేని ఒక గదిలో ఆయన్ను ఉంచారు. వాష్‌రూమ్‌ వాడుకోవడానికి అనుమతించడం లేదు. చిత్రహింసలు పెట్టారు. నెమ్మదిగా గుండెపోటును ప్రేరేపించే ఆహారం, ఇంజెక్షన్లు ఇచ్చారు. ఛాతిలో అసౌకర్యంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. ఇక ఇస్లామాబాద్‌లోని పోలీస్‌ లైన్స్‌కు తీసుకువచ్చిన తర్వాత ఆహారం కూడా ఇవ్వడం లేదు’ అని ఇమ్రాన్‌ న్యాయవాదులు వెల్లడించారు. 

తన అరెస్టును వ్యతిరేకిస్తూ ఇమ్రాన్‌ ఖాన్‌ సుప్రీంకోర్టు (Pak Supreme Court)లో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై పాక్‌ చీఫ్‌ జస్టిస్‌ ఉమర్‌ అతా బందియాల్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఇస్లామాబాద్‌ హైకోర్టు ప్రాంగణం నుంచి ఇమ్రాన్‌ఖాన్‌ను అరెస్టు చేయడంపై ఎన్‌ఏబీ(National Accountability Bureau)పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన్ను తక్షణమే విడుదల చేయాలని ఆదేశించింది.

నేడు ముందస్తు బెయిల్‌ కోసం ఇమ్రాన్‌ ఖాన్‌ ఇస్లామాబాద్‌ హైకోర్టు ఎదుట హాజరుకానున్నారు. అప్పుడే కోర్టు బయట తన మద్దతుదారులతోనూ మాట్లాడనున్నారు. ఇదిలా ఉంటే.. తాము ఇమ్రాన్‌ను మళ్లీ అరెస్టు చేస్తామని పాక్‌ మంత్రి రాణా సనావుల్లా వెల్లడించారు. మరో మంత్రి మాట్లాడుతూ.. ఇమ్రాన్‌ మద్దతుదారులు ప్రభుత్వ ఆస్తులు, మిలిటరీపై చేసిన దాడులను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదని వ్యాఖ్యానించారు. 

అవినీతి కేసులో పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ను మంగళవారం పారామిలిటరీ రేంజర్లు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఓ అవినీతి కేసుకు సంబంధించి ఇస్లామాబాద్‌ హైకోర్టులో విచారణకు హాజరైన సమయంలో అదుపులోకి తీసుకున్నారు. ఆయన అరెస్టుతో దేశవ్యాప్తంగా విధ్వంసకర ఘటనలు చోటుచేసుకున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని