Obesity: ప్రపంచంలో 100 కోట్ల మందికి ఊబకాయ సమస్య..

Obesity: ప్రపంచ జనాభాలో దాదాపు 100 కోట్లకు పైగా ఊబకాయంతో బాధపడుతున్నట్లు తేలింది. 30 ఏళ్ల క్రితంతో పోలిస్తే ఈ సమస్య నాలుగురెట్లు పెరిగిందని ఓ అధ్యయనం వెల్లడించింది.

Updated : 01 Mar 2024 11:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి.. కారణమేదైనా ఇవన్నీ మన ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. ముఖ్యంగా ‘అధిక బరువు’ ఈ మధ్య అనేక మందిని వేధిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇలా ఊబకాయం (Obesity)తో బాధపడేవారి సంఖ్య ఏకంగా 100 కోట్లు దాటిందట..! ఈ మేరకు తాజా అధ్యయనం వెల్లడించింది.

వీరిలో పెద్దలేగాక, పిల్లలు, యువకులూ ఉన్నారని ‘ది లాన్సెంట్‌ జర్నల్‌’ కథనం పేర్కొంది. సాధారణంగా పోషకాహార లోపం ఉన్నప్పుడు.. తక్కువు బరువు లేదా ఊబకాయానికి దారితీస్తుంది. అయితే, 1990 నుంచి తక్కువ బరువుతో బాధపడుతున్న వారి సంఖ్య క్రమంగా తగ్గుతోందని ఈ అధ్యయనం తెలిపింది. దీంతో చాలా దేశాల్లో పోషకాహార లోపంతో ఊబకాయం రావడం అనేది సాధారణ సమస్యగా మారిపోయిందని వెల్లడించింది.

2022 నాటికి ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మందికి పైగా అధిక బరువుతో బాధపడుతున్నట్లు లాన్సెంట్‌ తెలిపింది. వీరిలో 15.9కోట్ల మంది చిన్నారులు, యువకులు కాగా.. 87.9 కోట్ల మంది పెద్దలు ఉన్నట్లు పేర్కొంది. 1990 నాటితో పోలిస్తే.. ఊబకాయ బాధితుల సంఖ్య నాలుగురెట్లు పెరిగిందని అధ్యయనం తెలిపింది. ‘‘గతంలో ఒబెసిటీ అనేది కేవలం పెద్దవాళ్లలో మాత్రమే కన్పించేది. కానీ ఇప్పుడు స్కూల్‌కు వెళ్లే చిన్నారులు, టీనేజర్లనూ ఈ సమస్య వేధిస్తుండం తీవ్ర ఆందోళనకరం. పేద దేశాల్లో కోట్లాది మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఇది కూడా ఈ సమస్యకు ఓ కారణమై ఉండొచ్చు’’ అని ఈ అధ్యయనంలో పాల్గొన్న ఇంపీరియల్‌ కాలేజ్‌ లండన్‌ ప్రొఫెసర్‌ మాజిత్‌ ఇజాతి వెల్లడించారు.

ఎన్‌సీడీ రిస్క్ ఫ్యాక్టర్ కొలాబరేషన్ (NCD-RisC), ప్రపంచ ఆరోగ్య సంస్థ వద్ద అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా లాన్సెంట్‌ ఈ అధ్యయనం నిర్వహించింది. పెద్ద వయసు మహిళల్లో ఊబకాయం రెండింతలు, పురుషులలో దాదాపు 3 రెట్లు పెరిగిందని పేర్కొంది.

ఊబకాయంపై ప్రపంచ దేశాలు ఇప్పుడే మేల్కొని.. తగిన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో భవిష్యత్తులో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని గతంలో నిపుణులు హెచ్చరించారు, లేదంటే 2035 నాటికి ప్రపంచ జనాభాలో సగానికి పైగా అధిక బరువుతో బాధపడతారని వరల్డ్ ఒబేసిటీ ఫెడరేషన్ (World Obesity Federation) ఇప్పటికే హెచ్చరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని