Pakistan: పాక్‌లో పోలీసులపై ఆర్మీ అధికారుల అరాచకం.. నెట్టింట్లో వైరల్‌

పాకిస్థాన్‌ (Pakistan)లో ఆర్మీ అధికారులకు, పోలీసు సిబ్బందికి మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో పలువురు పోలీసులు గాయపడ్డారు. 

Published : 12 Apr 2024 18:33 IST

లాహోర్‌: పాకిస్థాన్‌ (Pakistan)లో ఎన్నికైన ప్రభుత్వం కూడా ఆర్మీ కనుసన్నల్లోనే నడుస్తుందనేది బహిరంగ రహస్యం. ఆ మాటను నిజం చేస్తూ సైనికులు కొందరు తమ అధికారాన్ని ప్రదర్శించారు. పోలీసుస్టేషన్‌లోకి చొచ్చుకెళ్లి.. అక్కడి సిబ్బందిని చితకబాదారు. యూనిఫాంలో ఉన్న పోలీసుల్ని బలవంతంగా మోకాళ్లపై కూర్చోబెట్టిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.

లాహోర్‌కు 400 కి.మీ. దూరంలో బహవల్‌నగర్ పోలీసుస్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. అక్రమంగా తీసుకొచ్చారన్న ఆరోపణలతో ఒక సైనికుడి కుటుంబం నుంచి పోలీసులు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆయన్ను అరెస్టు చేశారు. ఇది రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది. కొందరు ఆర్మీ సిబ్బంది స్టేషన్‌లోకి దూసుకువచ్చి, పోలీసులను వెంటబడి తరిమికొట్టి దాడి చేశారు. ఆ దెబ్బలకు తాళలేక తమను వదిలేయమని వారు వేడుకోవడం కొన్ని వీడియోల్లో కనిపించింది.

ప్రధాని దిగాలని.. విమానాన్ని దారి మళ్లించారు..!

‘‘ముగ్గురు పౌరులను పంజాబ్ పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్నారు. వారిని విడుదల చేయడానికి డబ్బు డిమాండ్ చేశారు’’ అంటూ అధికారిక వర్గాలు మీడియాకు వెల్లడించాయి. ఆ ముగ్గురికి సహకరించే వ్యక్తిని అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులు ఆర్మీ అధికారి ఇంటిపై సోదాలు నిర్వహించారు. ఇది కొందరు సైనికుల ఆగ్రహానికి దారితీసింది. దాంతో వారు అరెస్టయిన వారిని విడిపించేందుకు బహవల్‌నగర్‌ పోలీసుస్టేషన్‌పై దాడి చేశారు. ఆ క్రమంలోనే అక్కడి సిబ్బందికి గాయాలయ్యాయి’’ అని పేర్కొన్నాయి. చివరకు గాయపడిన ఆ పోలీసులు సస్పెన్షన్‌కు గురయ్యారు. చట్టవిరుద్ధంగా ముగ్గురు పౌరుల్ని అదుపులోకి తీసుకోవడం, వారి నుంచి డబ్బు దోచుకోవడం వంటి నేరం కింద కేసులు కూడా నమోదయ్యాయి.

‘‘వాస్తవంగా జరిగిన దానిని పక్కనపెట్టి, ఈ ఘటనను పెద్దదిగా చూపిస్తున్నారు. సోషల్ మీడియాలో నకిలీ ప్రచారం జరుగుతోంది. వాస్తవాలు గుర్తించేందుకు ఇరు వర్గాలు విచారణ జరిపాయి. శాంతియుతంగా ఈ వ్యవహారాన్ని పరిష్కరించాయి’’ అని పంజాబ్ పోలీసు విభాగం ఒక ప్రకటనలో పేర్కొంది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని