Pak Embassy: అఫ్గాన్‌లోని పాక్‌ రాయబారిపై హత్యాయత్నం..! ఖండించిన ప్రధాని షెహబాజ్‌

అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబుల్‌లోని పాక్‌ రాయబార కార్యాలయంపై శుక్రవారం దాడి జరిగింది. ఎంబసీ ఆవరణలో వాకింగ్‌ చేస్తున్న పాక్ రాయబారి ఉబైదుర్‌ రెహ్మాన్‌ నిజామనీని లక్ష్యంగా చేసుకుని.. ఓ గుర్తుతెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు.

Published : 03 Dec 2022 01:19 IST

కాబుల్‌: అఫ్గానిస్థాన్‌(Afghanistan) రాజధాని కాబుల్‌లోని పాక్‌ రాయబార కార్యాలయం(Pakistan Embassy)పై శుక్రవారం దాడి జరిగింది. ఎంబసీ ఆవరణలో వాకింగ్‌ చేస్తున్న పాక్ రాయబారి ఉబైదుర్‌ రెహ్మాన్‌ నిజామనీని లక్ష్యంగా చేసుకుని.. ఓ గుర్తుతెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. అయితే, సెక్యూరిటీ గార్డ్‌ అప్రమత్తం కావడంతో.. ఆయన ఈ ఘటన నుంచి సురక్షితంగా తప్పించుకున్నట్లు ఓ వార్తాసంస్థ తెలిపింది. అయితే, రాయబారిని కాపాడే ప్రయత్నంలో సెక్యూరిటీ గార్డ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలోనే రాయబారితోపాటు ఇతర అధికారులను పాకిస్థాన్ ప్రభుత్వం తాత్కాలికంగా వెనక్కి పిలిచినట్లు సమాచారం. మరోవైపు, తాలిబన్(Taliban) అధికారులు ఈ వ్యవహారంపై స్పందించాల్సి ఉంది.

తమ రాయబారిపై జరిగిన హత్యాయత్నాన్ని పాక్‌ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఖండించారు. ఈ ఘటనపై తక్షణమే దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఈ దుశ్చర్యకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ట్వీట్ చేశారు. రాయబారి ప్రాణాలు కాపాడిన సెక్యూరిటీ గార్డుకు సెల్యూట్‌ చెబుతూ.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. నిజామనీ.. నవంబర్ 4న కాబుల్‌లో రాయబారిగా బాధ్యతలు స్వీకరించారు. పాక్‌ మంత్రి హీనా రబ్బానీ ఖర్ కాబుల్‌లో పర్యటించి, ఉన్నతాధికారులతో చర్చలు జరిపిన కొద్దిరోజులకే ఈ దాడి జరగడం గమనార్హం. ఇదిలా ఉండగా.. అఫ్గాన్‌లోని తాలిబన్ ప్రభుత్వాన్ని పాకిస్తాన్ ఇప్పటివరకు అధికారికంగా గుర్తించలేదు. కానీ, తన దౌత్య కార్యాలయాన్ని నిర్వహిస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని