Pakistan: మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం...

ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌లో మరోసారి విద్యుత్‌ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రజలంతా అంధకారంలోనే గడపాల్సి రావడంపై ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ విచారం వ్యక్తంచేస్తూ ట్వీట్‌ చేశారు.

Published : 25 Jan 2023 01:18 IST

ఇస్లామాబాద్‌: ఆర్థిక సంక్షోభం(Economic crisis)తో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌(Pakistan)లో దయనీయ పరిస్థితులు చోటుచేసుకొంటున్నాయి. గతేడాది అక్టోబర్‌లో విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడగా.. తాజాగా అలాంటి దుస్థితే మరోసారి ఎదురైంది. దేశ వ్యాప్తంగా సోమవారం ఉదయం 7.30గంటల నుంచి విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు అంధకారంలోనే గడపాల్సి వచ్చింది. దీంతో పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌(Shehbaz Sharif) ట్విటర్‌లో స్పందించారు. విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో లక్షలాది మంది ప్రజలకు కలిగిన ఈ అసౌకర్యానికి చింతిస్తున్నట్టు ట్విటర్‌లో పేర్కొన్నారు. జాతీయ గ్రిడ్‌లో వోల్టేజీలో హెచ్చుతగ్గుల కారణంగా నిన్న ఇస్లామాబాద్‌, కరాచీతో పాటు పలు ప్రధాన నగరాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో సాధారణ జనజీవనానికి తీవ్ర ఆటంకం ఏర్పడింది. 

నిన్న విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కారణంగా ప్రజలకు తలెత్తిన అసౌకర్యానికి ప్రభుత్వం తరఫున విచారం వ్యక్తం చేస్తున్నట్టు షెహబాజ్‌ పేర్కొన్నారు. తాను ఇచ్చిన ఆదేశాల మేరకు విద్యుత్‌ వైఫల్యానికి గల కారణాలపై విచారణ జరుగుతోందన్నారు. మరోవైపు, ఇప్పటికే అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినప్పటికీ.. ఇంకా కొన్ని ప్రాంతాలు మాత్రం మంగళవారం కూడా అంధకారంలోనే ఉన్నట్టు సమాచారం. విద్యుత్ సరఫరాలో అంతరాయానికిగల కారణాలను తెలుసుకొనేందుకు ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ముగ్గురు సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. అయితే, పాక్‌ ఇంధన మంత్రి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా గ్రిడ్‌ స్టేషన్లలో మంగళవారం విద్యుత్‌ను పూర్తిస్థాయిలో పునరుద్ధరిస్తామన్నారు. 

విదేశీ మారకద్రవ్య నిల్వలు క్షీణిస్తుండటంతో గత కొన్నేళ్లుగా పాకిస్థాన్‌తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దీంతో ఇంధన పొదుపును పాటించేందుకు దేశవ్యాప్తంగా షాపింగ్‌ మాల్స్‌, మార్కెట్లలో రాత్రి 8.30గంటలకే మూసివేయాలని ఇటీవల ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. పాక్‌ విద్యుత్‌ రంగంలో నెలకొన్న ఇలాంటి పరిస్థితి ఆ దేశ ఆర్థిక దుస్థితికి అద్దంపట్టేలా ఉంది. కాలం చెల్లిన మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు నిధుల కొరత కారణంగా తరచూ విద్యుత్‌ సరఫరాలో ఇలాంటి ఆటంకాలు ఎదురవుతున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని