కరెన్సీ నోట్ల ప్రింటింగ్ ఒకవైపే.. వీడియో వైరల్!

కరెన్సీ నోట్లు ఒకవైపే ముద్రించిన ఘటన పాకిస్థాన్‌లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

Published : 15 Mar 2024 00:04 IST

కరాచీ: పాకిస్థాన్‌లో కరెన్సీ నోట్ల ముద్రణలో లోపం వెలుగులోకి వచ్చింది. ఒకవైపు తెల్లగా ఉన్న 1000, 500 (పాకిస్థాన్‌ రూపాయలు) నోట్లు చెలామణిలోకి రావడంతో వీటికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఆ దేశ ప్రజలు సగం ముద్రించిన నోట్లపై ఫిర్యాదు చేయడంతో పాకిస్థాన్‌ సెంట్రల్‌ బ్యాంకు ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. అలాగే, వాటిని స్థానిక బ్యాంకులో మార్చుకోవాలని ప్రజలకు సూచించింది. 

కొద్దిరోజుల క్రితం పాకిస్థాన్‌లో సగం ముద్రించిన నోట్లు అంటూ స్థానిక మీడియాలో వీడియోలు ప్రసారం అయ్యాయి. అందులో బ్యాంకు నుంచి తీసుకున్న కొత్త నోట్లలో కొన్నింటికి ముందు నగదు విలువ తెలియజేసేలా ఉండగా.. వెనకవైపు తెల్లగా ఉండటంతో వాటిని బ్యాంకు అధికారులకు తిరిగి ఇచ్చినట్లు చెప్పారు. ఈ క్రమంలోనే బ్యాంకు మేనేజర్ మరికొన్ని సగం ముద్రించిన నోట్లను చూపించాడు. దీనిపై పాక్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ ప్రకటన చేసింది.

నేషనల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ పాకిస్థాన్‌కు పంపిన కొన్ని నోట్ల కట్టల్లో పది సగం ముద్రించిన నోట్లు వచ్చాయి. ఒకవేళ బ్యాంకు నుంచి వాటిని ఎవరైనా అందుకుంటే స్థానిక బ్రాంచ్‌లో మార్చుకోవాలని కోరింది. ఈ ఘటనతో ఆ దేశ సెంట్రల్‌ బ్యాంక్‌ పనితీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కాలంలో పాక్‌ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. దానినుంచి గట్టేక్కేందుకు అంతర్జాతీయ సంస్థల వద్ద రుణాల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని