Pakistan: మోదీకి పాక్‌ అభినందనలు

వరసగా మూడోసారి భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్రమోదీని అభినందిస్తూ పాకిస్థాన్‌ సందేశం పంపింది. ప్రమాణ వేడుకకు పాకిస్థాన్‌ మినహా అన్ని పొరుగుదేశాలను మోదీ ఆహ్వానించిన విషయం తెలిసిందే.

Published : 11 Jun 2024 05:17 IST

దక్షిణాసియా భవితకు పాటుపడాలన్న నవాజ్‌ షరీఫ్‌ 
దేశాధినేతలకు మోదీ కృతజ్ఞతలు 

ఇస్లామాబాద్, దిల్లీ: వరసగా మూడోసారి భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్రమోదీని అభినందిస్తూ పాకిస్థాన్‌ సందేశం పంపింది. ప్రమాణ వేడుకకు పాకిస్థాన్‌ మినహా అన్ని పొరుగుదేశాలను మోదీ ఆహ్వానించిన విషయం తెలిసిందే. దీంతో దాయాది దేశం ఈ కార్యక్రమానికి దూరంగా ఉంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌ ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్, ఆయన సోదరుడైన మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ సోమవారం ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. ‘మోదీ సాధించిన విజయం ఆయనపైనా, ఆయన నాయకత్వంపైనా ప్రజల నమ్మకాన్ని ప్రతిబింబిస్తుంది. ద్వేషం బదులు ఆశాభావాన్ని మనం నెలకొల్పుదాం. దక్షిణాసియాలో ఉన్న 200 కోట్లమంది ప్రజల భవితవ్యాన్ని తీర్చిదిద్దడానికి ఈ అవకాశాన్ని మోదీ వినియోగించుకోవాలి’ అని నవాజ్‌ పిలుపునిచ్చారు. వారిద్దరికి ‘ఎక్స్‌’ వేదికగానే మోదీ ధన్యవాదాలు తెలిపారు. భారతదేశ ప్రజలు ఎప్పుడూ శాంతి, భద్రత, పురోగమన ఆలోచనలకు దన్నుగా నిలుస్తున్నారని చెప్పారు. ప్రజల శ్రేయస్సు, వారికి రక్షణ కల్పించడం ఎప్పటికీ తమ ప్రాధాన్యాంశాలుగా ఉంటాయని తెలిపారు. 


కెనడాతో కలిసి పనిచేస్తామన్న మోదీ 

నకు శుభాకాంక్షలు తెలిపిన వివిధ దేశాధినేతలకు మోదీ ధన్యవాదాలు తెలిపారు. కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడోకు కృతజ్ఞతలు చెబుతూ- ఒకరి ఆందోళనలను ఒకరు అర్థం చేసుకుంటూ పరస్పర అవగాహనతో కలిసి పనిచేసేందుకు భారత్‌ ఎదురుచూస్తోందన్నారు. ఉగాండాతో అన్ని రంగాల్లో ఉన్న చరిత్రాత్మక అనుసంధానాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు పాటుపడదామని ఆ దేశాధ్యక్షుడు యొవెరి కె ముసెవెనికి సందేశం పంపించారు. ఫిన్లాండ్, స్లొవేనియా ప్రధానులకు, అఫ్గాన్‌ మాజీ అధ్యక్షుడు హమీద్‌ కర్జాయ్‌కి, ప్రముఖ వితరణశీలి బిల్‌గేట్స్‌కి మోదీ కృతజ్ఞతలు చెప్పారు.


మోదీ పెద్దదిక్కు

-సింగపూర్‌ 

భారత దేశ రూపాంతరీకరణకు పెద్దదిక్కుగా మోదీ నిలుస్తున్నారని, ఆయనతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నానని సింగపూర్‌ ప్రధాని లారెన్స్‌ వాంగ్‌ తెలిపారు. కోట్లమంది అభ్యున్నతికి భారత ప్రధాని పాటుపడ్డారని, ఇకపైనా భారత్‌ అభివృద్ధి పథంలో దూసుకువెళ్తూనే ఉంటుందని చెప్పారు. చరిత్రాత్మక రీతిలో మూడోసారి మోదీ గెలుపొందారంటూ దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రమఫోసా అభినందనలు తెలిపారు. ఓట్ల ప్రక్రియలో పాల్గొన్న భారత ప్రజల్ని కూడా అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కొంత అస్థిరత నెలకొన్నా భారత్‌లో మోదీ మరోసారి ప్రధానిగా ఎన్నిక కావడం రాజకీయ, ఆర్థిక స్థిరత్వానికి బలమైన సందేశాన్ని పంపిందని ‘అమెరికా భారత్‌ వ్యాపార మండలి’ (యూఎస్‌ఐబీసీ) అధ్యక్షుడు కెశాప్‌ పేర్కొన్నారు. మోదీకి ఇప్పటివరకు వందకి పైగా దేశాలు అభినందన సందేశాలు పంపించాయి.


మన్మోహన్‌సింగ్, దేవేగౌడలకు ప్రధాని మోదీ ఫోన్‌ 

దిల్లీ: ప్రధాని మోదీ సోమవారం మాజీ రాష్ట్రపతి ప్రతిభాపాటిల్, మాజీ ప్రధానమంత్రులు మన్మోహన్‌సింగ్, దేవేగౌడలకు ఫోన్‌చేసి మాట్లాడారు. ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్రమోదీ వారికి ఫోన్‌చేసి ఆశీస్సులు కోరారని అధికారవర్గాలు తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు