Pakistan: ఇమ్రాన్‌ పార్టీపై నిషేధం..? ఆ వార్తలకు సమాధానం ఇచ్చిన పాక్‌ మంత్రి

ఆర్థిక సుడిగుండంలో చిక్కుకుపోయిన పాకిస్థాన్‌(Pakistan)లో రాజకీయ అస్థిరత తీవ్రరూపం దాల్చింది. అక్కడి ప్రభుత్వం.. మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ పార్టీని నిషేధించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 

Published : 24 May 2023 19:00 IST

ఇస్లామాబాద్‌: పొరుగు దేశం పాకిస్థాన్‌(Pakistan)లో రాజకీయ అస్థిరత కొనసాగుతోంది. మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్(Imran Khan) అరెస్టు తర్వాత అది తీవ్రరూపం దాల్చింది. అరెస్టు తదనంతర పరిణామాలపై పాక్‌ ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. దేశంలోని ఘర్షణలకు ఇమ్రాన్‌ పార్టీ పీటీఐనే కారణమని, దానిని నిషేధించాలని యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వాటిపై రక్షణ శాఖ మంత్రి ఖవాజా అసిఫ్ స్పందించారు. 

‘పీటీఐపై నిషేధం విధించే అంశం పరిశీలనలో ఉంది. ఆ పార్టీ దేశంలో తీవ్ర విధ్వంసం సృష్టించింది. గతంలో ఎన్నడూ అలా జరగలేదు. ఆ తీరును ఏ మాత్రం సహించలేం’ అని అసిఫ్ మండిపడ్డారు. అవినీతి ఆరోపణలపై మే 9న ఇమ్రాన్‌ ఖాన్‌(Imran Khan)ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆర్మీ, ప్రభుత్వ కార్యాలయాలపై నిరసనకారులు దాడులు చేశారు. కొన్నింటికి నిప్పంటించారు. దాంతో దాయాది దేశం రణరంగంలా మారిపోయింది. దాంతో భారీ సంఖ్యలో ఆందోళనకారులను ప్రభుత్వం అదుపులోకి తీసుకుంది. ఆ ఘటనలకు పాల్పడింది పీటీఐ కార్యకర్తలేనని అధికారపక్షం ఆరోపించింది. అయితే ఆ హింసతో తమకు ఏ సంబంధం లేదని పీటీఐ ఆ ఆరోపణలను తోసిపుచ్చుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని