Pakistan-Bangladesh: భారత్ ముందు పాక్‌ కుప్పిగంతులు.. బంగ్లాకు పనికిరాని ఆఫర్..!

Eenadu icon
By International News Team Published : 28 Oct 2025 16:34 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: బంగ్లాదేశ్‌లో తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్ (Muhammad Yunus) అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి భారత్‌ వ్యతిరేక వైఖరి అవలంబిస్తున్నారు. పాకిస్థాన్‌కు దగ్గరవుతున్నారు. ఈక్రమంలో తమ కరాచీ పోర్టు (Karachi port)ను వాడుకోమని బంగ్లాకు దాయాది ఆఫర్ ఇచ్చింది. దానిద్వారా జనపనార ఉత్పత్తులు, ఇతర వస్తువులను విదేశాలకు ఎగుమతి చేసుకోమని ప్రతిపాదించింది. భూమార్గంలో ఆ దేశం నుంచి దిగుమతి అవుతోన్న కొన్ని జనపనార వస్తువులకు భారత్‌ తలుపులు మూసేసిన నేపథ్యంలో పాక్ ఆ ఆఫర్ ఇవ్వడం గమనార్హం. 

బంగ్లా రాజధాని ఢాకాలో జరిగిన జాయింట్ ఎకనామిక్ కమిషన్‌ సమావేశంలో రెండుదేశాల మధ్య ఒప్పందం కుదిరింది. దీంతో ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాల పునరుద్ధరణకు నాందిపడినట్లయింది. చైనా, గల్ఫ్‌, మధ్య ఆసియా దేశాలతో వ్యాపారానికి ఇది కీలక ఓడరేవు కావడం గమనార్హం (Pakistan-Bangladesh). అయితే ఈ సముద్రమార్గం ఆర్థికంగా లాభదాయకంకాదని పలువురు నిపుణులు అభిప్రాయం వ్యక్తంచేశారు. ఇదిలా ఉంటే.. ఐదు దశాబ్దాల తర్వాత పాక్‌కు చెందిన సరకు రవాణా నౌక గత ఏడాది బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌ పోర్ట్‌కు వచ్చింది. అందుకోసం రెండువారాల పాటు 2,600 నాటికల్ మైళ్లు ప్రయాణించాల్సి వచ్చింది. ఇక అప్పటి నుంచి కరాచీ-చిట్టగాంగ్ పోర్ట్‌ల మధ్య పెద్దగా రాకపోకలు కనిపించలేదు. ఇక్కడ భారత్‌పై పాక్‌ మేకపోతు గాంభీర్యమే కనిపిస్తోంది కానీ.. పెద్దగా ప్రయోజనం చేకూర్చే చర్య కాదని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఇదిలాఉంటే, ఆర్థికంగా ఇప్పటికే చతికిలపడిన పాకిస్థాన్‌.. బంగ్లా జనపనార ఎగుమతుల (Jute exports)ను ప్రోత్సహించేందుకు సుంకాలు తగ్గించాలని నిర్ణయించిందని స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. ఇప్పటికే రెండుశాతం కస్టమ్ డ్యూటీని తగ్గించింది. అదే సమయంలో భారత్‌ నుంచి బంగ్లాకు మామిడి దిగుమతులు తగ్గడంతో ఆ అంతరాన్ని పూడ్చేసేందుకు తమ మామిడిని దిగుమతి చేసుకోవాలని పాక్ అభ్యర్థిస్తోంది. బంగ్లాదేశ్‌ (Bangladesh) ప్రపంచంలోనే రెండో అతిపెద్ద జనపనార ఉత్పత్తిదారుగా ఉంది. భూమార్గంలో కొన్ని ఎంపిక చేసిన జనపనార ఉత్పత్తులను ఆగస్టులో భారత్ నిషేధించింది. అంతకుముందు నేసిన, రెడీమేడ్ దుస్తుల దిగుమతులపై నిషేధం విధించింది.

భూమార్గంలో వాటిని నిషేధించినప్పటికీ.. నవీ ముంబయిలోని పోర్టు నుంచి మాత్రం వాటిని అనుమతిస్తోంది. అయితే అది బంగ్లాకు లాభదాయకం కాదు. అప్పటినుంచి ఆ దేశ ఎగుమతిదారుల ఖర్చులు గణనీయంగా పెరిగాయి. అలాగే ఈ ఏప్రిల్‌లో బంగ్లాదేశ్‌కు ఉన్న ట్రాన్స్‌-షిప్‌మెంట్‌ సదుపాయాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. అంతకుముందు బంగ్లాదేశ్‌కు చెందిన ఎగుమతులు భారత్‌ మీదుగా ఇతర దేశాలకు వెళ్లడానికి అనుమతి ఉండేది. ఆ దేశ జనపనార వస్తువులను దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్‌ కూడా ప్రధానమైంది.

ఇక మనదేశం తీసుకుంటున్న చర్యల కారణంగా ఎగుమతుల ఆదాయం జులైలో 3.4 మిలియన్ల డాలర్లకు తగ్గింది. అంతకుముందు ఏడాది అదే నెలలో 12.9 మిలియన్ల డాలర్ల మేర వ్యాపారం జరిగిందని మీడియా కథనాలు వెల్లడించాయి. ఇక, భారత్‌-బంగ్లా సంబంధాలు ఒత్తిడి గురవుతుంటే.. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని పాక్ (Pakistan) తెగ ఆరాటపడుతోంది. ఈ క్రమంలోనే కరాచీ పోర్టు (Karachi port) ప్రతిపాదన వచ్చింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు