Pakistan: మోదీకి అభినందనలు చెప్పని పాక్‌.. ఎందుకుంటే..?

ఆదివారం నరేంద్రమోదీ మరోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఇప్పటికే విదేశీ నేతల నుంచి అభినందనలు వెల్లువెత్తగా పాక్‌ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. 

Published : 08 Jun 2024 12:57 IST

ఇస్లామాబాద్: సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి మెజార్టీ సాధించి, మూడోసారి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధం అవుతోంది. మరోసారి నరేంద్రమోదీ (Modi) ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ తరుణంలో ప్రపంచవ్యాప్తంగా దేశాల అధినేతలు ఆయనకు అభినందనలు తెలియజేశారు. దాయాది దేశం పాకిస్థాన్‌ (Pakistan) నుంచి మాత్రం ఎలాంటి స్పందనా రాలేదు. దీనిపై పాక్‌ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ముంతాజ్‌ జాహ్రా బలోచ్‌ ఏమన్నారంటే..

‘‘భారత్‌ ఎన్నికల ప్రక్రియపై మేం మాట్లాడానికి ఏమీ లేదు. ఇంకా అక్కడ అధికారికంగా కొత్త ప్రభుత్వం ఏర్పడలేదు కాబట్టి.. ఇప్పుడే అభినందనలు చెప్పడం తొందరపాటే అవుతుంది’’ అని బలోచ్‌ వెల్లడించారు. నిర్మాణాత్మక చర్చల ద్వారా వివాదాలను పరిష్కరించుకోవాలని పాక్‌ కోరుకుంటుందని చెప్పారు. దాయాది దేశంతో సత్సంబంధాలనే కోరుకుంటున్నట్లు భారత్‌ కూడా పలుమార్లు చెప్పింది. ‘పాకిస్థాన్‌తో చర్చలకు తలుపులు మేం ఎప్పుడూ మూయలేదు. పెద్ద సంఖ్యలో ఉగ్రవాద కేంద్రాలు ఉన్న దేశంతో చర్చించాల్సి వస్తే.. ముఖ్యంగా దాని గురించే మాట్లాడాలి. ఇతరత్రా సమస్యలు ఉన్నా కూడా ప్రధానంగా ఉగ్రవాదంపైనే చర్చ ఉంటుంది’’ అని ఎస్‌. జై శంకర్‌ గతంలో వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఆదివారం సాయంత్రం 7.15 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో జరిగే కార్యక్రమంలో మోదీ ప్రధానిగా మూడోసారి ప్రమాణం చేయనున్నారు. దీనికి సంబంధించిన లాంఛనాలన్నీ పూర్తిచేశారు. అట్టహాసంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈనెల 5న ఎన్డీయే పార్టీల నేతలు కలిసి నరేంద్రమోదీని తమ నాయకుడిగా ప్రకటించగా శుక్రవారం కూటమి ఎంపీలంతా సమావేశమై ముక్తకంఠంతో ఆమోదముద్ర వేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని