Pakistan: కెనడాలో అదృశ్యమవుతోన్న పాకిస్థానీ ఎయిర్‌ హోస్టెస్‌లు!

పాకిస్థాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌ (PIA)కు చెందిన ఎయిర్‌ హోస్టెస్‌లు కెనడాలో (Canada) అదృశ్యం అవుతున్నారు.

Published : 29 Feb 2024 01:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పాకిస్థాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌ (PIA)కు చెందిన ఎయిర్‌ హోస్టెస్‌లు కెనడాలో (Canada) వరుసగా అదృశ్యం కావడం మిస్టరీగా మారింది. గత నెలలో ఒకరు కనిపించకుండా పోగా.. తాజాగా మరో మహిళా సిబ్బంది తప్పిపోయారు. ఇలా గత ఏడాది నుంచి ఇప్పటివరకు తొమ్మిది మంది కెనడాలో మాయమవడం గమనార్హం.

ఇస్లామాబాద్‌ (Pakistan) నుంచి కెనడాకు వెళ్లిన పీకే-782 విమానంలో మరియం రజా అనే ఎయిర్‌ హోస్టస్‌ ఉన్నారు. టొరంటోలో దిగిన ఆమె.. మరుసటి రోజు కరాచీ రావాల్సిన విమానంలో విధులకు హాజరుకాలేదు. దీంతో ఆమె బస చేసిన గదిని అధికారులు పరిశీలించారు. అక్కడ యూనిఫామ్‌తోపాటు ‘థ్యాంక్యూ పీఐఏ’ అని రాసి ఉన్న ఓ లేఖను గుర్తించారు. మరియం రజా గత పదిహేనేళ్లుగా పీఐఏలో పనిచేస్తున్నట్లు సమాచారం. పీఐఏ అధికార ప్రతినిధి ప్రకారం.. తమ సిబ్బంది టొరంటోలో అదృశ్యం కావడం ఈ ఏడాది ఇది రెండో కేసు అని పేర్కొన్నారు.

గతేడాది ఏడుగురు..

కెనడాకు వచ్చిన పాకిస్థానీ ఎయిర్‌హోస్టెస్‌లు ఇలా అదృశ్యం కావడం 2019 నుంచి మొదలైందట. ఇటీవల ఇది మరింత పెరిగినట్లు తెలుస్తోంది. గత ఏడాది ఏడుగురు పీఐఏ విమానయాన సిబ్బంది కెనడాలో కనిపించకుండా పోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే, ఇలా వెళ్లిపోయినవారు కెనడాలో ఆశ్రయం పొందుతున్నట్లు పాకిస్థానీ ఎయిర్‌లైన్స్‌ (PIA) భావిస్తోంది. కొన్నేళ్ల క్రితం డ్యూటీలో ఉన్న ఓ విమానయాన ఉద్యోగి పారిపోయి కెనడాలో స్థిరపడ్డారని.. అనంతరం అనేకమందికి సలహా ఇవ్వడంతో మిగతావారు కూడా అదే బాట పట్టినట్లు సదరు విమానయాన సంస్థ వెల్లడించింది.

Michelle Obama: బైడెన్‌కు ప్రత్యామ్నాయం మిషెల్‌ ఒబామా!

కెనడాలో ఆశ్రయం పొందే విధానం సరళంగా ఉండటంతోనే ఇటువంటివి ఎక్కువగా చోటుచేసుకుంటున్నట్లు పీఐఏ పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా కెనడా అధికారులతో సంప్రదింపులు చేస్తున్నామని తెలిపింది. విమానయాన సంస్థ వాదన ఇలా ఉన్నప్పటికీ.. సిబ్బందికి తక్కువ వేతనాలు, సంస్థ భవిష్యత్తుపై నెలకొన్న భయంతోనే కెనడా చేరుకున్న అనంతరం అదృశ్యమవుతున్నారని అంచనా వేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని