Pakistan: పాక్‌ నేవీ ఎయిర్‌స్టేషన్‌పై తిరుగుబాటుదారుల దాడి

Pakistan: ఇటీవలే గ్వాదర్‌ పోర్టుపై దాడికి పాల్పడిన బలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీ తాజాగా మరో నేవీ ఎయిర్‌స్టేషన్‌పై విరుచుకుపడింది.

Updated : 26 Mar 2024 11:51 IST

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లోని (Pakistan) రెండో అతిపెద్ద నేవీ ఎయిర్‌స్టేషన్‌ పీఎన్‌ఎస్‌ సిద్ధిఖ్‌పై సోమవారం రాత్రి దాడి జరిగింది. బలూచిస్థాన్‌లో ఉన్న ఈ స్థావరంపై పలువురు తిరుగుబాటుదారులు తుపాకులు, బాంబులతో విరుచుకుపడ్డారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. నలుగురు తీవ్రవాదులను హతమార్చారు. వారు లోపలికి ప్రవేశిస్తుండగానే గుర్తించి మట్టుబెట్టామని అక్కడి అధికారులు తెలిపారు. ఎయిర్‌స్టేషన్‌కు మాత్రం ఎలాంటి నష్టం జరగలేదని వెల్లడించారు. ఈ స్థావరంలో చైనాకు చెందిన డ్రోన్లను పెద్ద ఎత్తున మోహరించినట్లు సమాచారం.

ఈ దాడికి బాధ్యత వహిస్తూ ‘బలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీ (BLA)’ ఓ ప్రకటన విడుదల చేసింది. తమ కాల్పుల్లో పాకిస్థానీ బలగాలకు చెందిన డజను మంది మృతిచెందినట్లు తెలిపింది. పాకిస్థాన్‌ సైన్యం మాత్రం దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. వారం రోజుల్లో ఈ ముఠా ఇలాంటి దాడికి యత్నించడం ఇది రెండోసారి. మార్చి 20న గ్వాదర్‌ పోర్టుపైనా తిరుగుబాటుదారులు దాడికి పాల్పడ్డ విషయం తెలిసిందే. ఈ ఘటనలో భద్రతా బలగాలు ఏడుగురిని హతమార్చాయి. బీఎల్‌ఏను పాకిస్థాన్‌ సహా అమెరికా, యూకే ఉగ్రసంస్థగా గుర్తించాయి.

పాకిస్థాన్‌లోని అతిపెద్ద ప్రావిన్స్‌గా పిలిచే బలూచిస్థాన్‌ (Baluchistan) అనేక కొండలతో కూడిన ప్రాంతం. స్వాతంత్య్రం కోసం ఇక్కడ అనేక గ్రూపులు కొన్నేళ్లుగా తిరుగుబాటు చేస్తున్నాయి. చైనా-పాకిస్థాన్‌ ఎకనామిక్‌ కారిడార్‌ ప్రాజెక్టులను ఈ గ్రూపులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా బీఎల్‌ఏ వేర్పాటువాద సంస్థ చైనా పెట్టుబడులను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. బలూచిస్థాన్‌లోని గ్యాస్‌, ఖనిజ వనరులను చైనా, పాక్‌ దోపిడీ చేస్తున్నాయని ఆరోపిస్తోంది. చైనా-పాకిస్థాన్‌ ఎకనామిక్‌ కారిడార్‌ (సీపెక్‌)లో భాగంగా ఇక్కడి గ్వాదర్‌ పోర్ట్‌, ఇతర ప్రాజెక్టుల అభివృద్ధిలో చైనా పాలుపంచుకున్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని