Crime: ఇండియా పాకిస్థాన్‌ మ్యాచ్‌పై వ్లాగ్‌.. యూట్యూబర్ హత్య

ఆదివారం జరిగిన భారత్‌, పాక్‌ మ్యాచ్‌పై వ్లాగ్‌ చేస్తున్న ఓ పాకిస్థానీ యూట్యూబర్‌ సెక్యూరిటీ గార్డ్‌ చేతిలో మరణించిన ఘటన పాకిస్థాన్‌లోని కరాచీలో చోటుచేసుకుంది.

Published : 11 Jun 2024 18:52 IST

కరాచీ: ఇండియా(India) పాకిస్తాన్(Pakistan) మ్యాచ్‌ అంటే ఇరుదేశాలలోనూ అభిమానులు చాలా ఆతృతగా ఎదురుచూస్తుంటారు. దాయాది దేశంపై తమ జట్టు గెలుపొందాలని కలలు కంటుంటారు. అటువంటి క్రికెట్‌ మ్యాచ్‌ను ఆదివారం న్యూయార్క్‌లో నిర్వహించారు. పాకిస్థానీ మీడియా ప్రకారం... ఇండియా, పాకిస్థాన్‌కు క్రికెట్‌ మ్యాచ్‌ కాసేపట్లో జరగనుండగా మ్యాచ్‌పై వ్లాగ్‌ చేస్తున్న ఓ పాకిస్థానీ యూట్యూబర్‌(YouTuber) సెక్యూరిటీ గార్డ్‌ చేతిలో హతమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

జూన్ 9న న్యూయార్క్‌(New York)లో నిర్వహించిన ఇండియా, పాకిస్థాన్ టీ20 ప్రపంచకప్‌ మ్యాచ్‌ మొదలవడానికి ముందు ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటూ వ్లాగ్‌ చేయడానికి సాద్ అహ్మద్ అనే పాకిస్థానీ యూట్యూబర్ కరాచీలోని మొబైల్ మార్కెట్‌కి వెళ్లాడు. అక్కడ అతడు వ్లాగ్‌ షూట్‌ చేస్తూ కొందరు యువకుల అభిప్రాయాలను చిత్రీకరించాడు. అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డును సైతం మ్యాచ్‌ గురించి పలుమార్లు అడగ్గా అతడు చెప్పడానికి నిరాకరించాడు. అయినా యూట్యూబర్‌ వినకుండా వీడియో చిత్రీకరిస్తుండడంతో ఆగ్రహించిన సెక్యూరిటీ గార్డ్‌ తుపాకితో అతడిపై కాల్పులు జరిపాడు. ఆ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన యువకుడు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు.

ఎంత చెప్పినా వినిపించుకోకుండా మైక్‌ని తన ముఖానికి దగ్గరగా పెడుతూ వీడియో తీస్తుండడంతో తాను సహనం కోల్పోయి యూట్యూబర్‌పై కాల్పులు జరిపినట్లు సెక్యూరిటీ గార్డ్‌ తెలిపాడు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని