Pervez Musharraf: ‘కార్గిల్‌’ కుట్ర పన్ని.. పదవి కోసం నియంతగా మారి..!

కార్గిల్‌చొరబాట్లకు కారకుడు, పాక్‌ మాజీ అధ్యక్షుడు జనరల్‌ పర్వేజ్‌ ముషారఫ్‌ (79)(Pervez Musharraf) కన్నుమూశారు. గత కొంతకాలంగా అమైలాయిడోసిస్‌ అనే రుగ్మతతో బాధపడుతోన్న ఆయన.. దుబాయిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.

Updated : 05 Feb 2023 12:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పాకిస్థాన్‌(Pakistan) మాజీ సైనిక పాలకుడు జనరల్‌ పర్వేజ్‌ ముషారఫ్‌ (79)(Pervez Musharraf) కన్నుమూశారు. గత కొంతకాలంగా అమైలాయిడోసిస్‌ అనే రుగ్మతతో బాధపడుతోన్న ఆయన.. దుబాయిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. అధ్యక్షుడిగా ఎనిమిదేళ్ల పాటు పాకిస్థాన్‌(Pakistan)ను ‘నియంత’ వలే పాలించిన ముషారఫ్‌(Pervez Musharraf) అనేక వివాదాల్లో చిక్కుకున్నారు. భారత్‌, పాక్‌ మధ్య కార్గిల్‌ యుద్ధానికి కుట్రలు పన్నడం దగ్గర్నుంచి.. మాజీ ప్రధాని బెనజీర్‌ భుట్టో హత్య వరకు పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొన్నారు. పదవి కాంక్షతో ఏకంగా రాజ్యాంగాన్నే రద్దు చేసి.. అత్యవసర స్థితిని విధించారు.

దిల్లీలో జన్మించి..

1943 ఆగస్టు 11న అవిభాజ్య భారత్‌లోని దిల్లీలో జన్మించిన ముషారఫ్‌(Pervez Musharraf).. కరాచీ, ఇస్తాంబుల్‌లో పెరిగారు. లాహోర్‌లోని ఫార్మన్‌ క్రిస్టియన్‌ కాలేజీలో మ్యాథమెటిక్స్‌ చదివిన ముషారఫ్‌(Pervez Musharraf).. ఆ తర్వాత యూకేలోని రాయల్ కాలేజీ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టడీస్‌లో చేరారు. 1961లో పాకిస్థాన్‌(Pakistanమిలిటరీ అకాడమీలో చేరి సైనిక శిక్షణ తీసుకున్నారు. ఆ తర్వాత 1964లో పాక్‌ సైన్యంలో చేరారు. 1965 ఇండో-పాకిస్థాన్‌ యుద్ధంలో సెకండ్‌ లెఫ్టినెంట్‌గా పనిచేశారు. అఫ్గాన్‌ అంతర్యుద్ధంలోనూ కీలక పాత్ర పోషించారు. 1990ల్లో మేజర్‌ జనరల్‌గా పదోన్నతి పొందారు. డిప్యూటీ మిలిటరీ సెక్రటరీ, మిలిటరీ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ జనరల్‌గానూ వ్యవహరించారు.

తొలిసారి యుద్ధంలో..

మిలిటరీలో చేరిన ఏడాదికే ముషారఫ్‌(Pervez Musharraf)ను భారత సరిహద్దుల్లో విధులకు పంపారు. అదే సమయంలో భారత్‌- పాక్‌ మధ్య యుద్ధం జరిగింది. ఆ తర్వాత ముషారఫ్‌(Pervez Musharraf) స్పెషల్‌ సర్వీస్‌ గ్రూప్‌లో చేరారు. 1971 యుద్ధం సమయంలో ఎస్‌ఎస్‌జీ బెటాలియన్‌ కంపెనీ కమాండర్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ మేజర్‌ జనరల్ స్థాయికి చేరారు. ఆ హోదాలో ఉన్నప్పుడు నాటి చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌తో కలిసి మిలిటరీ ఆపరేషన్స్‌కు డైరెక్టర్‌ జనరల్‌గా పనిచేశారు.

కార్గిల్‌ యుద్ధ కారకుడిగా..

భారత్‌, పాక్‌ మధ్య జరిగిన కార్గిల్‌ యుద్ధానికి ముషారఫ్‌(Pervez Musharraf) ప్రధాన కారకుడు. సరిహద్దుల్లోని సియాచిన్‌ ప్రాంతంలో భారత్‌ పట్టును ఆయన సహించలేకపోయారు. అందుకే కార్గిల్‌ చొరబాటుకు 1988-89 మధ్య అప్పటి పాక్‌ ప్రధాని బెనజీర్‌ భుట్టోకు ప్రతిపాదించారు. బెనజీర్‌ భుట్టోతో ముషారఫ్‌ అత్యంత సన్నిహితంగా ఉండేవారు. 1992-95 మధ్య పాక్‌-అమెరికా మధ్య జరిగిన అనేక ఉన్నత స్థాయి సమావేశాల్లో భుట్టోతో కలిసి ముషారఫ్‌ కూడా పాల్గొన్నారు. ఆ చొరవతోనే కార్గిల్‌ చొరబాటు ప్రతిపాదన చేశారు. అయితే, యుద్ధ పరిణామాలపై భయంతో భుట్టో దీనిపై వెనక్కి తగ్గారు. కానీ ముషారఫ్‌(Pervez Musharraf) మాత్రం అంత తేలిగ్గా ఈ విషయాన్ని వదిలిపెట్టలేదు. 1999 మార్చి నుంచి మే మధ్య కార్గిల్‌ ప్రాంతంలోకి రహస్యంగా పాక్‌ సైన్యాన్ని జొప్పించారు. ఈ విషయాన్ని భారత్‌ గుర్తించడంతో రెండు దేశాల మధ్య పూర్తి స్థాయి యుద్ధం మొదలైంది. అయితే, ఈ విషయం అప్పటి ప్రధాని నవాజ్‌ షరీఫ్‌కు తెలియకపోవడం గమనార్హం. కార్గిల్‌ యుద్ధ సమయంలో నాటి భారత ప్రధాని వాజ్‌పేయీ.. షరీఫ్‌కు ఫోన్‌ చేస్తే యుద్ధం గురించి తనకేమీ తెలియదని అన్నారట.

పైకి తెచ్చిన వ్యక్తినే కూలదోసి..

నిజానికి ముషారఫ్‌(Pervez Musharraf) సైన్యాధిపతి కావడానికి కారణం మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫే. చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌గా ఉన్న జనరల్‌ కరామత్‌కు, ప్రధాని షరీఫ్‌కు మధ్య విబేధాలు రావడంతో ఆయనను పదవి నుంచి తొలగించాలని షరీఫ్‌ సర్కారు నిర్ణయించింది. ఆ సమయంలో ముషారఫ్‌(Pervez Musharraf)కు సాయుధ బలగాలతో పాటు పౌరుల్లోనూ మంచి పేరుంది. దీంతో షరీఫ్‌ వ్యక్తిగతంగా ముషారఫ్‌(Pervez Musharraf)కు ఫోర్‌ స్టార్‌ జనరల్‌గా పదోన్నతి కల్పించి చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌, జాయింట్ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ ఛైర్మన్‌గా నియమించారు. అయితే కార్గిల్‌ యుద్ధంతో ముషారఫ్‌, షరీఫ్‌ మధ్య విభేదాలు మొదలయ్యాయి. ముషారఫ్‌ను పదవి నుంచి తొలగించి ఆయన బాధ్యతలను ఖ్వాజా జియాయుద్దీన్‌కు అప్పగించాలని షరీఫ్‌ నిర్ణయించుకున్నారు.  ఈ విషయం తెలియగానే ఆగ్రహానికి గురైన ముషారఫ్‌(Pervez Musharraf) 1999 అక్టోబరులో సైనిక తిరుగుబాటు చేసి షరీఫ్‌ను గద్దెదింపారు. దేశంలో సైనిక పాలన విధించి అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. షరీఫ్‌ను గృహ నిర్బంధం చేసి ఆ తర్వాత అరెస్టు చేశారు.

తనను తానే అధ్యక్షుడిగా ప్రకటించుకుని..

2001 జూన్‌లో ముషారఫ్‌(Pervez Musharraf) తనను తానే అధ్యక్షుడిగా ప్రకటించుకుని యావత్‌ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశారు. ఆ తర్వాత ఏడాది జనాభిప్రాయ సేకరణ తంతు పూర్తి చేసి ఐదేళ్ల పాటు అధ్యక్షుడిగా కొనసాగారు. 2007లో అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి రెండోసారి దేశ పగ్గాలు అందుకున్నారు. అయితే ఈ ఎన్నికను సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టులో తనకు వ్యతిరేకంగా తీర్పు రానుందని పసిగట్టిన ఆయన.. తీర్పు వెలువడడానికి నాలుగు రోజులు ముందుగానే.. న్యాయవ్యవస్థను వంచించి.. ఉగ్రవాదాన్ని సాకుగా చూపి దేశంలో ఎమర్జెన్సీ విధించారు. రాజ్యాంగాన్ని రద్దు చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న ఇఫ్తికార్‌ ఎం ఛౌదురిని పదవి నుంచి తొలగించారు. తనకు అనుకూలంగా ఉన్న జస్టిస్‌ అబ్దుల్‌ హమీద్‌ దోగార్‌ను హుటాహుటిన చీఫ్‌ జస్టిస్‌గా నియమించారు. కొత్త న్యాయమూర్తి.. ముషారఫ్‌(Pervez Musharraf) ఎన్నికకు ఆమోదముద్ర వేయడంతో పరిస్థితులు సద్దుమణిగాయి.

పారిపోయి.. మళ్లీ వచ్చి

అయితే 2008లో అధికారంలో ఉన్న రెండు ప్రముఖ పార్టీలు ముషారఫ్‌(Pervez Musharraf)కు వ్యతిరేకంగా అభిశంసన తీర్మానం తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యాయి. తన ఉద్వాసన తప్పదని భావించి దేశాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఏర్పాటైన ప్రజా ప్రభుత్వం.. ముషారఫ్‌ అరెస్టుకు రంగం సిద్ధం చేసింది. మాజీ ప్రధాని బేనజీర్‌ భుట్టో, లాల్‌ మసీదు మతపెద్ద అబ్దుల్‌ రషీద్‌ ఘాజీల హత్య కేసులోనూ ఆయనపై ఆరోపణలున్నాయి. 2007లో రాజ్యాంగాన్ని తాత్కాలికంగా రద్దు చేసినందుకు ఆయనపై దేశద్రోహం అభియోగాన్ని మోపారు. దీంతో 2008 నవంబరులో ఆయన లండన్‌కు పారిపోయారు. ఆ తర్వాత 2013లో పాక్‌కు తిరిగొచ్చిన ముషారఫ్‌.. సాధారణ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆయన ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు పడింది. 2013లో ఆయనను అరెస్టు చేయాలని కోర్టు ఆదేశాలివ్వగా.. ముషారఫ్‌ పారిపోయి ఫామ్‌హౌజ్‌లో దాక్కొన్నారు. అయితే పోలీసులు అతడిని గృహనిర్బంధంలో ఉంచారు. ఆ తర్వాత కోర్టుకు ఆయనకు బెయిల్‌ మంజూరు చేయడంతో పాటు వైద్య చికిత్స కోసం విదేశాలకు వెళ్లేందుకు అనుమతినిచ్చింది. అయితే తనపై ఉన్న కేసుల్లో ఎప్పటికైనా శిక్ష తప్పదని భావించిన ముషారఫ్‌.. చికిత్స పేరుతో 2016లో దుబాయి వెళ్లిపోయారు.

మరణశిక్షను ఎదుర్కొని..

2007లో దేశ రాజ్యాంగాన్ని రద్దు చేసి అత్యవసర స్థితిని ప్రకటించినందుకు గానూ దేశద్రోహం కేసులో 2019లో ఇస్లామాబాద్‌ కోర్టు ఆయనకు మరణశిక్ష విధించింది. ఆ సమయంలో కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘‘ముషారఫ్‌(Pervez Musharraf)ను ఉరితీయండి. అతడి మృతదేహాన్ని పార్లమెంట్‌ ఎదురుగా ఉన్న డిస్క్వేర్‌ వద్దకు తీసుకురండి. ప్రజలకు గుర్తుండిపోయేలా మూడు రోజల పాటు కూడలిలో మృతదేహాన్ని వేలాడదీయండి’’ అంటూ కోర్టు వ్యాఖ్యానించింది. అయితే ఆ మరుసటి ఏడాది ఈ మరణశిక్షను తగ్గించడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని