Israel Hamas Conflict: గాజాలో ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు: కమలా హారిస్‌

Israel Hamas Conflict: గాజాలో అనేక మంది ఆకలితో అలమటిస్తున్నారని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ అన్నారు. వారికి వెంటనే సాయం అందించాలని కోరారు.

Published : 04 Mar 2024 11:56 IST

Israel Hamas Conflict | వాషింగ్టన్‌: ఇజ్రాయెల్‌ హమాస్‌ యుద్ధానికి కేంద్ర బిందువుగా ఉన్న గాజాలో సామాన్య ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ (Kamala Harris) ఆవేదన వ్యక్తం చేశారు. వారికి అందుతున్న మానవతా సాయాన్ని పెద్ద ఎత్తున పెంచాలని ఇజ్రాయెల్‌ను కోరారు. కనీసం ఆరు వారాలైనా కాల్పులకు విరామమివ్వాలని సూచించారు. తద్వారా బందీలను సైతం విడిపించుకునే అవకాశం ఉంటుందని చెప్పారు.

‘‘గాజాలో ప్రతిరోజూ ఘోరమైన ఘటనలు చూస్తున్నాం. కొంతమంది ఆకులు,  పశుగ్రాసం తింటున్నారని తెలిసింది. వైద్య సంరక్షణ లేకపోవటంతో స్త్రీలు పోషకాహార లోపంతో ఉన్న శిశువులకు జన్మనిస్తున్నారు. డీహైడ్రేషన్‌తో పిల్లలు చనిపోతున్నారు. చాలా మంది అమాయక పాలస్తీనియన్లు చనిపోతున్నారని మాకు సమాచారం ఉంది’’ అని ఆదివారం అలబామాలో జరిగిన ఓ కార్యక్రమంలో కమలా హారిస్‌ అన్నారు.

ఇజ్రాయెల్‌, హమాస్‌ (Israel Hamas Conflict) మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కోసం కొన్ని రోజులుగా ప్రయత్నాలు జరుగుతున్న విషయం తెలిసిందే. కానీ, ఇరు పక్షాల మధ్య సయోధ్య కుదరకపోవటంతో అది కార్యరూపం దాల్చడం లేదు. అమెరికా, ఈజిప్టు, ఖతర్‌ ఆ దిశగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్వయంగా సంధికి రావాలని ఇరు వర్గాలకు విజ్ఞప్తి చేస్తున్నారు. బందీల వివరాలను వెల్లడించడానికి హమాస్‌ నిరాకరిస్తోందని ఈజిప్టులో ఉన్న ఇజ్రాయెల్‌ ప్రతినిధులు తెలిపారు. మరోవైపు ఇంకా ఎవరెవరు బతికి ఉన్నారో నిర్ధరించడం కష్టమని హమాస్‌ సీనియర్‌ అధికారి ఒకరు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని