Dina Boluarte: ఖరీదైన వాచీ తెచ్చిన చిక్కు.. అధ్యక్షురాలి ఇంట్లో సోదాలు

పెరూ అధ్యక్షురాలు డైనా బులురెటే (Dina Boluarte) అధికారిక నివాసంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించడం చర్చనీయాంశమైంది.

Published : 31 Mar 2024 00:04 IST

లిమా: పెరూ దేశ అధ్యక్షురాలు డైనా బులురెటే (Dina Boluarte)కు రోలెక్స్‌ వాచీ చిక్కులు తెచ్చిపెట్టింది. అధ్యక్షురాలిగా ఎన్నికైన సమయంలో ప్రజా రికార్డుల్లో చూపించని ఖరీదైన రోలెక్స్‌ వాచీని (Rolex Watch) ఆమె పెట్టుకున్నారంటూ స్థానిక పత్రికల్లో ప్రచురితమయ్యాయి. వీటి ఆధారంగా అక్కడి అవినీతి నిరోధక శాఖ అధికారులు అమె అధికారిక నివాసంలో శనివారం సోదాలు నిర్వహించారు. అధ్యక్షురాలిగా ఎన్నికైన తర్వాత అధికారాన్ని అడ్డం పెట్టుకొని అవినీతికి పాల్పడారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే, సోదాలు జరుగుతున్న సమయంలో డైనా తన నివాసంలో లేరు. 

శనివారం ఉదయం అధ్యక్షురాలి ఇంటికి అవినీతి నిరోధకశాఖ అధికారులు చేరుకోవడం, సోదాలు జరిపిన దృశ్యాలు స్థానిక ఛానెళ్లలో ప్రసారమయ్యాయి. అక్కడి అత్యున్నత న్యాయస్థానం నియమించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ సమక్షంలోనే సోదాలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. డైనా డిసెంబర్‌ 2022లో అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వాన్ని రద్దు చేయాలని అప్పటి అధ్యక్షుడు పెడ్రో కాస్టిల్లో ప్రయత్నించడంతో ఆయన్ని అధికారం నుంచి తొలగించి.. డీనా అధ్యక్షపగ్గాలు అందుకున్నారు. పెరూ తొలి మహిళా అధ్యక్షురాలు ఆమెనే. అక్కడి రాజ్యాంగం ప్రకారం.. అధ్యక్షురాలిపై అవినీతి ఆరోపణలు రుజువైనప్పటికీ.. పదవీ కాలం పూర్తయ్యే వరకు చర్యలు తీసుకునే అవకాశం లేదు. జులై 2026 వరకు ఆమె ఆ పదవిలో కొనసాగుతారు.

స్వచ్ఛంగా వచ్చా.. మకిలి లేకుండా వెళ్తా..: డైనా

మరోవైపు తనపై వచ్చిన అవినీతి ఆరోపణలను డైనా కొట్టిపారేశారు. ప్రభుత్వ డబ్బుతో అంత ఖరీదైన వస్తువులు ఎలా కొనుగోలు చేశారని గత వారం ఆమెను మీడియా ప్రశ్నించగా..  ‘‘ ప్రభుత్వ సొమ్ముతో కొనుగోలు చేయలేదు. 18 ఏళ్ల వయసు నుంచి కష్టపడుతున్నా.. స్వశక్తితోనే ఖరీదైన వస్తువులు కొనుక్కున్నా. స్వచ్ఛంగా అధ్యక్ష భవనంలోకి అడుగుపెట్టా.. మకిలి లేకుండానే ఇక్కడి నుంచి వెళ్తా’’ అని ఆమె అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు