Pakistan: కరవులో ఉన్న పాక్‌కు భారత నౌక ద్వారా గోధుమల సరఫరా

భారతీయుడు ఏర్పాటు చేసిన ఓ కంపెనీకి చెందిన నౌక పాకిస్థాన్‌లో ఆకలి కేకలు తగ్గించేందుకు సహకరించింది. రష్యా నుంచి 50 వేల టన్నుల గోధుమలను పాక్‌కు డెలివరీ చేసింది.

Published : 05 Mar 2023 13:11 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, ఆహార ధాన్యాల కరువులో ఉన్న పాకిస్థాన్‌(Pakistan )కు ఓ భారత నౌక కొంత ఉపశమనం కల్పించింది. భారతీయుడికి చెందిన ఓ నౌక రష్యా(Russia) నుంచి 50,000 మెట్రిక్‌ టన్నుల గోధుములను సరఫరా చేసింది. ప్రస్తుతం 40శాతం ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న పాకిస్థాన్‌కు ఇది పెద్ద ఊరట. రష్యా నుంచి 4.5లక్షల టన్నుల గోధుమలను దిగుమతి చేసుకొనేందుకు పాక్‌ కన్సైన్‌మెంట్‌ కుదుర్చుకొంది. దీనిలో భాగంగా తాజాగా జీఎంఎస్‌ (గ్లోబల్‌ మార్కెటింగ్‌ సిస్టమ్స్‌) ఐఎన్‌ఎసీ కంపెనీకి చెందిన ‘ఎంవీ లీలా చెన్నై’ అనే నౌక 50వేల మెట్రిక్‌ టన్నుల గోధుమలను రష్యాలోని నోవొరోసిస్క్‌ ఓడరేవు నుంచి పాకిస్థాన్‌లోని గ్వాదర్‌ నౌకాశ్రాయానికి చేర్చింది. ఈ నౌక లైబీరియా ఫ్లాగ్‌తో పాక్‌కు చేరినట్లు రికార్డులు చెబుతున్నాయి.

జీఎంఎస్‌ సంస్థను డాక్టర్‌ అనిల్‌ శర్మ అనే గుజరాతీ వ్యాపారవేత్త దుబాయ్‌ నుంచి నిర్వహిస్తున్నారు. ఆయన గతంలో అమెరికాలోని ఓ ప్రముఖ బిజినెస్‌ స్కూల్‌లో ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఆయన వ్యాపార నిర్వహణలో డాక్టరేట్‌ చేసి అమెరికాలో 10ఏళ్లపాటు ప్రొఫెసర్‌గా సేవలు అందించారు. 1992లో జీఎంఎస్‌ కంపెనీని  ప్రారంభించారు. ఇది ఆ తర్వాత గ్లోబల్‌ షిప్పింగ్‌ రీసైక్లింగ్‌లో అగ్రస్థానానికి చేరుకొంది. ప్రస్తుతం ఈ కంపెనీ ఆధీనంలో 40 నౌకలు ఉన్నాయి. షిప్పింగ్‌ పరిశ్రమలో గత 13 ఏళ్లుగా అత్యంత పలుకుబడి ఉన్న 100 మంది వ్యక్తుల్లో అనిల్‌ శర్మ కూడా ఒకరు. ‘షిప్‌టెక్‌ 2022 సీఈవో ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు కూడా అందుకొన్నారు. దేశీయ ఫుట్‌బాల్‌లో ఒడిశా ఎఫ్‌సీకి ఆయనే యజమాని.

అవకాశాన్ని అందిపుచ్చుకొని..

1990ల్లో అమెరికా నేవీకి చెందిన నౌకలను యూఎస్‌ మారిటైమ్‌ అడ్మినిస్ట్రేషన్‌ ద్వారా విక్రయించేది. వీటిపై భారతీయ మార్కెట్‌లోని వ్యాపారులు చాలా ఆసక్తి చూపించేవారు. కానీ, ఆ టెండర్లలో పాల్గొనేందుకు విదేశీయులకు అవకాశం లేదు. దీంతో భారత వ్యాపారులు బిడ్లు వేయడానికి ఇబ్బంది పడేవారు. దీనిని అవకాశంగా తీసుకొన్న శర్మ తొలుత ఆ నౌకలను తాను కొనుగోలు చేసి.. ఆ తర్వాత వాటిని భారత వ్యాపారులకు విక్రయించేవాడు. దీంతో అమెరికాలోని మారిటైమ్‌ అడ్మినిస్ట్రేషన్‌లో జీఎంఎస్‌ అతిపెద్ద కొనుగోలుదారుగా అవతరించింది. మరోవైపు రష్యా వద్ద అదనంగా పడిఉన్న నౌకలను వదిలించుకోవడానికి కూడా జీఎంఎస్‌ సహాయం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 4,000 నౌకల పునర్వినియోగానికి (రీసైక్లింగ్‌) సహకరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు