Modi: పుతిన్‌కు శుభాకాంక్షలు.. జెలెన్‌స్కీకు భరోసా.. ఇద్దరు అధ్యక్షులకు మోదీ ఫోన్‌

ఐదోసారి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా పుతిన్‌కు ఫోన్‌ చేసిన మోదీ.. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు.

Published : 20 Mar 2024 19:55 IST

దిల్లీ: రష్యా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన వ్లాదిమిర్‌ పుతిన్‌ (Vladimir Putin)కు భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఐదోసారి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా పుతిన్‌కు ఫోన్‌ చేసిన మోదీ.. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఉక్రెయిన్‌-రష్యా సంక్షోభ పరిష్కారానికి సంప్రదింపులు, చర్చలే మార్గమని ఉద్ఘాటించారు. అనంతరం ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతోనూ (Volodymyr Zelenskyy) మాట్లాడిన మోదీ.. సంక్షోభ ముగింపునకు భారత్‌ తనవంతు కృషి చేయడంతోపాటు మానవతా సహాయాన్ని కొనసాగిస్తుందని భరోసా ఇచ్చారు.

పుతిన్‌కు శుభాకాంక్షలు..

‘అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడాను. మరోసారి ఎన్నికైనందున శుభాకాంక్షలు తెలియజేశాను. భారత్‌-రష్యా మధ్య ద్వైపాక్షిక, వ్యూహాత్మక బంధాలను రాబోయే రోజుల్లో మరింత బలోపేతం చేసేందుకు అంగీకరించాం’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. వీటితోపాటు ఉక్రెయిన్‌ చుట్టూ నెలకొన్న పరిస్థితులు, పలు అంతర్జాతీయ అంశాలపైనా సుదీర్ఘంగా ఇరువురు నేతలు చర్చించినట్లు భారత విదేశాంగశాఖ తెలిపింది. ఇదే అంశంపై అటు రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ స్పందిస్తూ.. మరికొన్ని రోజుల్లో జరగనున్న పార్లమెంటు ఎన్నికలను విజయవంతంగా నిర్వహించాలని పేర్కొంటూ మోదీకి శుభాకాంక్షలు తెలియజేసినట్లు వెల్లడించింది.

ఉక్రెయిన్‌కు భరోసా..

రష్యా-ఉక్రెయిన్‌ సంక్షోభానికి సాధ్యమైనంత త్వరగా శాంతియుత పరిష్కారం కోసం భారత్‌ అన్నివిధాలా కృషి చేస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇదే సమయంలో మనవతా సహాయాన్ని భారత్‌ కొనసాగిస్తుందన్నారు. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ఫోన్‌లో సంభాషించిన మోదీ.. సంప్రదింపులు, దౌత్యమార్గాల్లో ముందుకు వెళ్లాలని సూచించారు. ఇదే విషయాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్‌తోనూ చెప్పినట్లు పేర్కొన్నారు. ఉక్రెయిన్‌కు భారత్‌ అందిస్తోన్న మానవతా సాయాన్ని జెలెన్‌స్కీ ప్రశంసించారు. వివిధ అంశాల్లో ఇరు దేశాలు ద్వైపాక్షిక సంబంధాలను మరింత పెంపొందించే మార్గాలపై చర్చించినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఇలా ఒకేరోజు రష్యా, ఉక్రెయిన్‌ అధ్యక్షులతో మోదీ సంభాషించడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని