Modi: భారత్‌తో మరింత బలమైన బంధం.. మోదీకి దేశాధినేతల శుభాకాంక్షలు

Modi: తాజా సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీయే కూటమి, ప్రధాని మోదీకి ప్రపంచవ్యాప్తంగా పలువురు దేశాధినేతలు శుభాకాంక్షలు తెలియజేశారు.

Updated : 05 Jun 2024 12:18 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి (PM Modi) ప్రపంచవ్యాప్తంగా పలువురు దేశాధినేతలు శుభాకాంక్షలు తెలియజేశారు. భారత ప్రజల శ్రేయస్సుకు ఆయన కృషి చేస్తారని విశ్వాసం వ్యక్తంచేశారు. మోదీ నేతృత్వంలోని భారత్‌తో సత్సంబంధాలు కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.

సార్వత్రిక ఎన్నికల్లో (Loksabha Election Results) భాజపా 240 స్థానాల్లో గెలిచింది. దేశంలోకెల్లా ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్‌ 99 చోట్ల విజయం సాధించింది. ఆ పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 272 సీట్లను సాధించింది. ఈ నేపథ్యంలో తెదేపా, జేడీయూ సహా ఇతర మిత్రపక్షాలతో కలిసి కేంద్రంలో భాజపా మళ్లీ అధికార పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమైంది.

‘‘2024 భారత సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా మూడోసారి విజయం సాధించిన ప్రధానమంత్రి మోదీ, భాజపా, ఎన్డీయే కూటమికి అభినందనలు. భారత్‌, మాల్దీవుల ప్రజల శ్రేయస్సు, ప్రయోజనాల కోసం కలిసి పనిచేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం’’ - మహమ్మద్‌ ముయిజ్జు, మాల్దీవుల అధ్యక్షుడు

‘‘ఎన్నికల విజయంపై మోదీకి అభినందనలు. ప్రజాశ్రేయస్సు కోసం పాటుపడుతున్న మీకు శుభాకాంక్షలు. ఇటలీ, భారత్‌ బంధాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తాం. ఇరు దేశాలు, ప్రజల శ్రేయస్సు కోసం సహకారంతో ముందుకెళ్తాం’’- జార్జియా మెలోనీ, ఇటలీ అధ్యక్షురాలు

‘‘భాజపా నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో సాధించిన పురోగతి, శ్రేయస్సుపై ప్రజలు విశ్వాసముంచారు. పొరుగుదేశంగా భారత్‌తో బంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు శ్రీలంక ఎదురుచూస్తోంది’’ - రణిల్‌ విక్రమ సింఘే, శ్రీలంక అధ్యక్షుడు

‘‘మూడోసారి చరిత్రాత్మక విజయం సాధించినందుకు ప్రధాని మోదీకి అభినందనలు. మీ నాయకత్వంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం అద్భుతమైన పురోగతిని సాధిస్తూనే ఉంటుంది. మారిషస్ - భారత్ ప్రత్యేక సంబంధాలు చిరకాలం కొనసాగాలి’’ - ప్రవింద్‌ కుమార్‌, మారిషస్‌ ప్రధాని

‘‘లోక్‌సభ ఎన్నికల్లో భాజపా, ఎన్డీయే వరుసగా మూడోసారి విజయం సాధించినందుకు ప్రధాని నరేంద్రమోదీకి అభినందనలు. భారత ప్రజల ఉత్సాహభరితమైన భాగస్వామ్యంతో ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య కసరత్తు విజయవంతంగా పూర్తయినందుకు సంతోషిస్తున్నాం’’ - ప్రచండ, నేపాల్‌ ప్రధాని

‘‘చరిత్రాత్మకంగా వరుసగా మూడోసారి విజయం సాధించిన నా మిత్రుడు ప్రధాని నరేంద్రమోదీ, ఎన్డీయేకి శుభాకాంక్షలు. ఉన్నత శిఖరాలకు ఎదుగుతున్న భారత్‌తో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం’’ - షెరింగ్‌ తోబ్గే, భూటాన్‌ ప్రధాని

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని