PM Modi: స్పెయిన్‌ నూతన ప్రధానికి మోదీ ఫోన్‌!

 స్పెయిన్‌ ప్రధానమంత్రిగా మరోసారి ఎన్నికైన పెడ్రో శాంచెజ్‌కు ప్రధాని మోదీ ఫోన్‌ చేసి అభినందించారు.

Published : 17 Nov 2023 21:09 IST

దిల్లీ: స్పెయిన్‌ ప్రధానమంత్రిగా మరోసారి ఎన్నికైన పెడ్రో శాంచెజ్‌కు (Spain Prime Minister Pedro Sanchez) ప్రధాని మోదీ ఫోన్‌ (PM Modi) చేసి అభినందించారు. ఇరుదేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని కోరారు. గురువారం స్పెయిన్‌ పార్లమెంట్‌ వేదికగా జరిగిన ఓటింగ్‌ ప్రక్రియలో మొత్తం 350 మంది సభ్యులకుగానూ 179 మంది పెడ్రో శాంచెజ్‌కు మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. ‘‘ పెడ్రో శాంచెస్‌.. స్పెయిన్‌ ప్రధానిగా మరోసారి ఎన్నికైనందుకు మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు. భారత్‌- స్పెయిన్‌ సంబంధాలను మరింత బలోపేతం చేస్తారని ఆకాంక్షిస్తున్నాను. ఇరుదేశాల స్నేహ సంబంధాలు ఉజ్వల భవిష్యత్‌కు దోహదపడతాయని ఆశిస్తున్నాను’’ అని ప్రధాని ట్వీట్ చేశారు.

స్పెయిన్‌ ప్రధాని పదవీకాలం ముగియడంతో జులైలో ఎన్నికలు నిర్వహించారు. అయితే, ఏ పార్టీకీ స్పష్టమైన ఆధిక్యత రాకపోవడంతో తదుపరి ప్రధాని ఎవరా? అన్నదానిపై ప్రతిష్టంభన ఏర్పడింది. ఈ నేపథ్యంలో సోషలిస్టు పార్టీకి చెందిన శాంచెజ్‌ మరో ఆరు చిన్న పార్టీలతో కలిసి కూటమిగా ఏర్పడి.. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చారు. ప్రధాని పదవి చేపట్టేందుకు 176 మంది మద్దతు అవసరం కాగా.. పెడ్రో శాంచెజ్‌కు మ్యాజిక్‌ ఫిగర్‌ కంటే ముగ్గురు సభ్యుల మద్దతు అధికంగా లభించింది. పెడ్రోకు మద్దతు తెలిపిన పార్టీల్లో రెండు కెటలోనియా వేర్పాటువాద పార్టీలు కూడా ఉన్నాయి. కేటలోనియా వేర్పాటు ఉద్యమనేత చార్లెస్‌ పిడ్గెమోంట్‌కు క్షమాభిక్ష ప్రకటించేందుకు పెడ్రో సాంఛెజ్‌ అంగీకరించడంతో ఆయనకు మద్దతిచ్చేందుకు ఆ రెండు పార్టీలు అంగీకరించాయి.  దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని