Gunness world record: ఐరాసలో మోదీ యోగా ఈవెంట్.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు
Yoga: ప్రధాని నరేంద్ర మోదీ ఐరాసలో నిర్వహించిన యోగా ఈవెంట్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది.
న్యూయార్క్: అంతర్జాతీయ యోగా దినోత్సవం((International Day of Yoga) సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం వద్ద నిర్వహించిన యోగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటుదక్కించుకుంది. ఈ కార్యక్రమంలో అత్యధిక దేశాలకు చెందిన ప్రతినిధులు భాగస్వామ్యం కావడంతో ఈ రికార్డు నమోదైంది. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. యోగా (Yoga) ఏ ఒక్క దేశం, మతం, వర్గానికి చెందినది కాదన్నారు. దీనికి ఎలాంటి కాపీరైట్, పేటెంట్, రాయల్టీలు లేవని స్పష్టం చేశారు. ఐరాస ఉన్నతాధికారులు, వివిధ దేశాల దౌత్యవేత్తలతోపాటు 180 దేశాలకు చెందిన పలువురు ప్రముఖులు, ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. న్యూయార్క్ మేయర్, మూడుసార్లు గ్రామీ అవార్డు గ్రహీత రికీ కెజ్, గాయని ఫాల్గుణి షా, నటులు రిచర్డ్ గేర్, ప్రియాంక చోప్రాతోపాటు ఐక్యరాజ్య సమితి అధికారులు భాగస్వాములయ్యారు.
‘ప్రతిదేశం నుంచి వచ్చిన వారు ఇక్కడ ఉన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించాలని తొమ్మిదేళ్ల క్రితం ఇక్కడనుంచే ప్రతిపాదించాను. యావత్ ప్రపంచం దీనికి మద్దతు పలకడం సంతోషంగా ఉంది. యోగా భారత్ నుంచి వచ్చింది. దీనికి అత్యంత ప్రాచీన చరిత్ర ఉంది. అన్ని ప్రాచీన సంప్రదాయాల మాదిరిగానే ఇది కూడా సజీవమైనది, ఎంతో చైతన్యమైనది. అన్ని దేశాల సంప్రదాయాలకు సరిపోయే విధానం యోగా. దీంతో శారీరక, మానసిక ఆరోగ్యం సమకూరుతుంది. దీనికి ఎటువంటి కాపీరైట్లు, పేటెంట్లు, రాయల్టీ చెల్లింపులు లేవు. మీ వయసు, లింగం, ఫిట్‌నెస్ స్థాయిలను బట్టి దీన్ని అలవరచుకోవచ్చు. ఇది పూర్తిగా విశ్వజనీనం.. ఆరోగ్యకరమైంది’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
న్యూయార్క్‌లో ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం ప్రధాని మోదీ రాజధాని వాషింగ్టన్ డీసీకి వెళ్తారు. అక్కడి ఆండ్రూ ఎయిర్‌బేస్‌లో ప్రవాస భారతీయులు ఆయనకు స్వాగతం పలుకుతారు. వ్యాపారవేత్తలు, కంపెనీల సీఈవోలతోపాటు ఇతర ప్రముఖులతో వరుస భేటీలు ఉంటాయి. అనంతరం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దంపతుల ఆతిథ్యాన్ని స్వీకరిస్తారు. వైట్‌హౌస్‌లో గౌరవ వందనం స్వీకరిస్తారు. తర్వాత అధ్యక్షుడి కార్యాలయంలో ఇరుదేశాల అధినేతలు ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఆ సాయంత్రం అమెరికా ఉభయసభలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తారు.
సూరత్‌లో సరికొత్త రికార్డు
మరోవైపు, యోగా డే కార్యక్రమం గుజరాత్‌లోని సూరత్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది. ఒకేచోట 1.53లక్షల మందితో నిర్వహించిన యోగా సెషన్ గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంది. అంతకముందు 2018లో రాజస్థాన్‌లోని కోటలో 1,00,984 మందితో నిర్వహించిన యోగా సెషన్ రికార్డును ఇది తిరిగరాసినట్టయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Intresting News: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Jawan: ‘జవాన్’ ఆఫర్.. ఒక టికెట్ కొంటే మరొకటి ఫ్రీ.. ఆ మూడు రోజులే!
-
Pakistan-New Zealand: హైదరాబాద్ చేరుకున్న పాకిస్థాన్, న్యూజిలాండ్ క్రికెట్ జట్లు
-
Amaravati: ఏపీ సచివాలయంలో 50 మంది అసిస్టెంట్ సెక్రటరీలకు రివర్షన్
-
Law Commission: ‘జమిలి’ నివేదికపై కసరత్తు జరుగుతోంది.. లా కమిషన్ ఛైర్మన్
-
IND vs AUS: టీమ్ఇండియా ఆలౌట్.. మూడో వన్డేలో ఆస్ట్రేలియా విజయం