POK: పీవోకే విదేశీ భూభాగమే.. అంగీకరించిన పాకిస్థాన్‌!

POK| పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ విదేశీ భూభాగమని పాకిస్థాన్‌ ప్రభుత్వం ఇస్లామాబాద్‌ హైకోర్టులో అంగీకరించింది.

Published : 01 Jun 2024 18:00 IST

ఇస్లామాబాద్‌: పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (POK) విదేశీ భూభాగమని పాకిస్థాన్‌ ప్రభుత్వం (Pakistan Govt) ఇస్లామాబాద్‌ హై కోర్టులో (Islamabad High Court) అంగీకరించింది. అక్కడ పాకిస్థాన్‌ చట్టాలు చెల్లబోవని చెప్పింది. పాత్రికేయుడి కిడ్నాప్‌ కేసుపై శుక్రవారం విచారణ సందర్భంగా పాకిస్థాన్‌ అదనపు అటార్నీ జనరల్‌ ఇస్లామాబాద్‌ కోర్టులో ఈమేరకు వ్యాఖ్యానించారు. రావల్పిండిలోని తన ఇంట్లో ఉన్న అహ్మద్‌ ఫర్హద్‌ షా అనే పాత్రికేయుడిని పాకిస్థాన్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ మే 15న కిడ్నాప్‌ చేసింది. దీనిపై ఆయన భార్య అక్కడి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

దీనిపై జస్టిస్‌ మోసిన్‌ అక్తర్‌ కయాని నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. అహ్మద్‌ ఫర్హద్‌ను కోర్టు ఎదుట ప్రవేశపెట్టాలని ఆదేశించింది. ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అదనపు అటార్నీ జనరల్‌.. ప్రస్తుతం అహ్మద్‌ ‘పీవోకే’లో పోలీస్‌ కస్టడీలో ఉన్నట్లు కోర్టుకు తెలిపారు. అది విదేశీ భూభాగమని, అక్కడ ప్రత్యేక రాజ్యాంగం, చట్టాలు ఉంటాయని, పాకిస్థాన్‌ చట్టాలు చెల్లబోవని చెప్పారు. అందువల్ల అతడిని కోర్టు ఎదుట ప్రవేశపెట్టడం కుదరదని వివరించారు.

దీనిపై స్పందించిన జస్టిస్‌ కయానీ ఒకవేళ పీవోకే విదేశీ భూభాగమైతే.. పాకిస్థాన్‌ రేంజర్లు, పాక్‌ మిలటరీ ఎందుకు ఆ ప్రాంతంలోకి చొరబడుతున్నారని చురకలంటించింది. సామన్యులను విచారణ పేరుతో ఇంటెలిజెన్స్‌ సంస్థలు బలవంతంగా నిర్బంధించడాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది. మరోవైపు పాక్‌ న్యాయవాది వ్యాఖ్యలతో భారత్‌కు మరింత బలం చేకూరినట్లయింది. ‘పీవోకే’ భారత్‌లో అంతర్భాగమని, అది 1947 నుంచి పాక్‌ ఆక్రమణలో ఉందని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌ ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నారు. పీవోకే ఎప్పటికీ భారత్‌తోనే ఉంటుందని, అది భారత్‌లోనే ఉంటుందని వివిధ సందర్భాల్లో ఆయన నొక్కి చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని