Pakistan: ‘ప్రథమ మహిళ’గా అధ్యక్షుడి కుమార్తె.. పాక్‌ కీలక నిర్ణయం..!

Pakistan: పాకిస్థాన్‌ కొత్త ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ ప్రథమ మహిళగా అధ్యక్షుడు జర్దారీ కుమార్తెను అధికారికంగా గుర్తించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Published : 11 Mar 2024 13:51 IST

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ (Pakistan) పీపుల్స్‌ పార్టీ(పీపీపీ) సహ ఛైర్మన్‌ ఆసిఫ్‌ అలీ జర్దారీ (Asif Ali Zardari) రెండోసారి దేశాధినేత పగ్గాలు చేపట్టారు. పాక్‌ 14వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ క్రమంలోనే దేశ ప్రథమ మహిళ (First Lady)గా తన కుమార్తె 31 ఏళ్ల ఆసిఫా భుట్టోను అధికారికంగా గుర్తిస్తూ ఆయన కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు పాక్‌ మీడియా కథనాలు సోమవారం వెల్లడించాయి.

సాధారణంగా దేశాధ్యక్షుడి సతీమణికి ప్రథమ మహిళ హోదా లభిస్తుంది. అయితే జర్దారీ భార్య, మాజీ ప్రధాని బెనజీర్‌ భుట్టో 2007లో హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన మరో వివాహం చేసుకోలేదు. 2008-13 మధ్య తొలిసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన సయమంలో ప్రథమ మహిళ హోదాను ఖాళీగా ఉంచారు.

ఈ క్రమంలోనే తాజా పదవీ కాలంలో ఈ హోదా చిన్న కుమార్తె ఆసిఫాకు ఇవ్వాలని జర్దారీ నిర్ణయించినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి. ఈ విషయంపై అధ్యక్షుడి పెద్ద కుమార్తె భక్తావర్‌ భుట్టో చేసిన పోస్ట్‌ ఈ కథనాలను మరింత బలపరుస్తోంది. ‘‘కోర్టు విచారణలు, న్యాయపోరాటం దగ్గర్నుంచి అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసే వరకు జర్దారీకి అన్ని వేళలా మా పాక్‌ ప్రథమ మహిళ ఆసిఫా వెన్నంటే నిలిచింది’’ అని ఆమె పోస్ట్‌ చేశారు.

పాక్‌ అధ్యక్షుడిగా జర్దారీ ప్రమాణం

దీంతో పాక్‌ ప్రథమ మహిళగా ఆసిఫా భుట్టో ప్రకటన ఖాయమనే తెలుస్తోంది. 2020లో ఆమె తొలిసారిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అప్పటి నుంచి పీపీపీ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. జర్దారీ ప్రమాణస్వీకార కార్యక్రమానికీ ఆమె హాజరయ్యారు.

అధ్యక్షుడి జీవిత భాగస్వామి కాలం చేస్తే.. ఆయన కుమార్తెలు, సోదరీమణులు లేదా మేనకోడళ్లకు ప్రథమ మహిళ హోదా ఇవ్వడం కొన్ని దేశాల్లో అధికారికమే. అమెరికా మాజీ అధ్యక్షుడు ఆండ్రూ జాక్సన్‌ తన హయాంలో తన మేనకోడలు ఎమ్లీ డోనెల్సన్‌ను దేశ ప్రథమ మహిళగా ప్రకటించారు. అగ్రరాజ్యంలో మరో ఇద్దరు మాజీ అధ్యక్షులు చెస్టర్‌ ఆర్థర్‌, గ్రోవర్‌ క్లీవ్‌ల్యాండ్‌ తమ సోదరీమణులకు ఆ హోదా కల్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని