Private lander: చంద్రుడి ఉపరితలం చేరిన తొలి ప్రైవేటు ల్యాండర్‌

Private lander: తాము పంపిన ల్యాండర్‌ చంద్రుడి ఉపరితలంపై దిగిందని అమెరికాకు చెందిన ప్రైవేటు సంస్థ ఇంట్యూటివ్‌ మెషీన్స్‌ ప్రకటించింది.

Published : 23 Feb 2024 09:08 IST

కేప్‌ కెనవెరాల్‌: అమెరికాకు చెందిన ప్రైవేటు ల్యాండర్‌ ఒడిస్సస్‌ (Odysseus Lander) గురువారం చంద్రుడిపై దిగింది. 1972లో అపోలో మిషన్‌ తర్వాత నాసా చేపట్టిన చంద్రమండల యాత్ర ఇదే కావడం గమనార్హం. తాజా ప్రయోగంతో ఒక ప్రైవేటు సంస్థ చంద్ర మండల యాత్రను తొలిసారిగా దిగ్విజయంగా చేపట్టినట్లయింది. గతవారమే ఇంట్యూటివ్‌ మెషీన్స్‌ (Intuitive Machines) ఈ ల్యాండర్‌తో కూడిన రాకెట్‌ను ప్రయోగించింది.

ల్యాండర్‌ (Odysseus Lander) నుంచి వచ్చే సంకేతాలు బలహీనంగా ఉన్నాయని ఇంట్యూటివ్‌ మెషీన్స్‌ (Intuitive Machines) వెల్లడించింది. అయితే, చంద్రుడి ఉపరితలంపై దిగిందని మాత్రం ధ్రువీకరణ అయినట్లు తెలిపింది. ప్రస్తుతం దాని పరిస్థితి ఏంటి? ఏ ప్రాంతంలో ల్యాండ్‌ అయ్యిందనే విషయాలను మాత్రం వెల్లడించలేదు. చంద్రుడిపై దిగినట్లు ప్రకటించిన వెంటనే లైవ్‌ వెబ్‌క్యాస్ట్‌ను నిలిపివేశారు. ల్యాండర్‌ నుంచి వస్తున్న బలహీన సిగ్నల్స్‌ను ఎలా మెరుగుపర్చాలో విశ్లేషిస్తున్నామని ఈ ప్రాజెక్టు డైరెక్టర్ టిమ్‌ క్రెయిన్‌ ప్రకటించారు. 

ఈ ప్రయోగంతో దాదాపు 50 ఏళ్ల తర్వాత అమెరికా చంద్రమండల యాత్ర చేపట్టినట్లయింది. మరోవైపు చంద్రుడి ఉపరితలంపైకి చేరిన తొలి ప్రైవేటు కంపెనీగా ఇంట్యూటివ్‌ మెషీన్స్‌ (Intuitive Machines) నిలిచింది. గత నెలలో ఆస్ట్రోబోటిక్‌ ఆ దిశగా అడుగులు వేసినప్పటికీ.. అది విఫలమైంది. ఒడిస్సస్‌ ప్రయోగం కోసం ఇంట్యూటివ్‌కు నాసా 118 మిలియన్‌ డాలర్ల నిధులను అందజేసింది. రోదసీ యాత్రలను వాణిజ్యీకరించడంలో భాగంగా దీన్ని చేపట్టింది.

దక్షిణ ధ్రువానికి 300 కిలోమీటర్ల దూరంలో ల్యాండర్‌ను దింపాలని ఇంట్యూటివ్‌ మెషీన్స్‌ (Intuitive Machines) లక్ష్యంగా పెట్టుకుంది. ‘మాలాపెర్ట్‌ ఏ’ అనే బిలానికి సమీపంలో అనువైన ప్రాంతాన్ని ఎంచుకొని ల్యాండయ్యేలా ప్రోగ్రామ్‌ చేశారు. వారం పాటు పనిచేసేలా దీన్ని రూపొందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని