Khalistan protests: టొరంటోలో ఖలిస్థానీల నిరసన.. ప్రతిగా భారతీయుల ప్రదర్శన..!

కెనడా కాలమానం ప్రకారం శనివారం టొరంటోలోని భారత దౌత్యకార్యాలయం ఎదుట ఖలిస్థానీలు ఆందోళన చేపట్టారు. 

Updated : 09 Jul 2023 19:27 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కెనడా(Canada)లోని టొరంటో(Toronto) నగరంలో ఖలిస్థానీ మద్దతుదార్లు(Khalistan protests) ఆందోళన చేపట్టగా.. దీనికి దీటుగా భారత జాతీయులు కూడా స్పందించారు. శనివారం భారత కాన్సులేట్‌ కార్యాలయం ఎదుట ఇరు పక్షాలు పోటాపోటీగా జెండాలను పట్టుకొని ప్రదర్శనకు దిగాయి. తొలుత ఖలిస్థానీలు ఇక్కడకు వచ్చి ఆందోళన చేపట్టగా.. భారత్‌కు మద్దతుగా కూడా ప్రదర్శనలు మొదలయ్యాయి. 

మరోవైపు జులై 8వ తేదీన ఆందోళనలు చేపట్టాలని గత కొన్ని రోజులుగా ఖలిస్థాన్‌ మద్దతుదార్లు ఆన్‌లైన్‌లో ప్రచారం చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికాలోని వాషంగ్టన్‌ డీసీలో ఉన్న భారత దౌత్యకార్యాలయానికి భద్రతను పెంచారు. ఇక్కడ కూడా ఖలిస్థాన్‌ మద్దతుదార్లు ఆందోళన చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం అందడంతో ఈ చర్యలు తీసుకున్నారు. ఇప్పటి వరకు ఎటువంటి అవాంఛనీయ ఘటన చోటు చేసుకోలేదు. భారత దౌత్యవేత్త తరణ్‌జీత్‌ సింగ్‌ సంధు ఎంబసీ వద్ద పరిస్థితిని పర్యవేక్షించారు.

జులై 2వ తేదీ వేకువజాములో ఖలిస్థాన్‌ మద్దతుదారులు శాన్‌ఫ్రాన్సిస్కో(San Francisco) దౌత్యకార్యాలయానికి నిప్పంటించారు. అయితే, స్థానిక అగ్నిమాపక విభాగం వేగంగా స్పందించి మంటల్ని ఆర్పేశారు. ఈ ఘటనలో దౌత్య సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. అయితే, ఈ దాడిపై అమెరికా స్పందించింది. ‘దౌత్యకార్యాలయంపై విధ్వంసానికి పాల్పడటం, దహనం చేయడానికి చేసిన యత్నాలను అమెరికా తీవ్రంగా ఖండిస్తోంది. దౌత్యకార్యాలయాలు, విదేశీ దౌత్యవేత్తలపై హింసకు పాల్పడటం వంటి చర్యలను అమెరికాలో తీవ్ర నేరాలుగా పరిగణిస్తాం’అని యూఎస్‌ విదేశాంగ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ అప్పట్లో ట్వీట్ చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని