Benjamin Netanyahu: ఇజ్రాయెల్‌ ప్రధానిపై పెరుగుతోన్న వ్యతిరేకత.. ఇంటి ముందు ప్రజల ఆందోళన!

హమాస్‌తో యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రజలు తమ దేశ ప్రధాన మంత్రి బెంజమిన్‌ నెతన్యాహుపై ఆగ్రహంతో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన ఇంటి వద్ద పలువురు ఆందోళనకు దిగారు. 

Published : 05 Nov 2023 05:14 IST

జెరూసలెం: హమాస్‌ (Hamas)తో యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్‌ (Israel) ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu)కి సొంత ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. హమాస్‌ దాడుల్ని గుర్తించడంలో, వారి చెర నుంచి పౌరుల్ని కాపాడుకోవడంలో, యుద్ధంలో సరైన నిర్ణయాలు తీసుకోవడంలో ప్రధాని విఫలమయ్యారని ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఈ క్రమంలోనే శనివారం పలువురు నిరసనకారులు నెతన్యాహు ఇంటి వద్ద ఆందోళన చేపట్టారు. జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ నెతన్యాహుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి వారిని అక్కడి నుంచి పంపించారు.

దేశంలో 76 శాతం మంది ప్రజలు ప్రధాని పదవికి నెతన్యాహు రాజీనామా చేస్తేనే మంచిదని భావిస్తున్నారట. తాజాగా అక్కడి మీడియా నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. యుద్ధం ముగిసిన వెంటనే ఎన్నికలు నిర్వహించాలని 64 శాతం మంది ప్రజలు కోరుకుంటున్నారట. హమాస్‌ దాడులను గుర్తించడంలో వైఫల్యం ఎవరదని సర్వే చేయగా.. 44 శాతం మంది నెతన్యాహునే నిందించారు. 33 శాతం సైన్యాధికారులది, 5 శాతం రక్షణ శాఖ మంత్రిది వైఫల్యమని చెప్పారట. 

గతంలోనూ నెతన్యాహు ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా మారి దేశ ప్రజల ఆగ్రహానికి గురయ్యారు. అవినీతి ఆరోపణలు రాగా.. తాను నిర్దోషినని నిరూపించకోవడం మానేసి.. న్యాయవ్యవస్థ అధికారాలను కుదించే ప్రయత్నం చేశారు. దీంతో ప్రధాని ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్నారంటూ వందలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని