Putin: ఎలుగుబంటి దాడి నుంచి పుతిన్‌ను కాపాడి.. పవర్‌ఫుల్ పోస్ట్‌కు ఎంపికై..!

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ (Putin)కు బాడీగార్డ్‌గా పనిచేసి, ఆయన సన్నిహిత వర్గంలో ఒకరిగా మారిన అలెక్సీ డ్యూమిన్‌కు కీలక పదవి దక్కింది. 

Published : 29 May 2024 17:32 IST

మాస్కో: రష్యా అధినేత పుతిన్‌ (Putin) పాలనలో ఆయన సన్నిహితులే కీలక పదవుల్లో కొలువుదీరుతుంటారు. తాజాగా అదే దారిలో ఒకప్పటి ఆయన బాడీగార్డ్‌ అలెక్సీ డ్యూమిన్‌(Alexey Dyumin).. స్టేట్‌ కౌన్సిల్‌ సెక్రటరీగా నియమితులయ్యారు. ఈమేరకు అధ్యక్ష కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. అది దేశవిదేశాంగ విధానానికి సంబంధించి వ్యూహాత్మక లక్ష్యాలు, కార్యాచరణను రూపకల్పన చేస్తుంది. అందుకోసం క్రెమ్లిన్‌, చట్టసభ సభ్యులు, ప్రాంతీయ నేతలతో కలిసి పనిచేస్తుంది.

పుతిన్‌ ఇటీవలే ఐదోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఈ తర్వాత పలు కీలక పదవుల్లో మార్పులు చేర్పులు చేశారు. దాంతో తుల రీజియన్ గవర్నర్‌గా ఉన్న అలెక్సీని అధ్యక్ష కార్యాలయానికి తీసుకువచ్చారు. ఆయన 1999 నుంచి పుతిన్‌ రక్షణ వలయంలో పని చేశారు. తర్వాత కాలంలో ఆయన అత్యంత సన్నిహిత బాడీగార్డ్‌గా మారారు. ఒకసారి పుతిన్‌ను ఎలుగుబంటి దాడి నుంచి కాపాడారనే కథనం ప్రచారంలో ఉంది. అలాగే అధ్యక్షుడితో ఐస్‌ హాకీ ఆడే అంతర్గత సభ్యుల్లో డ్యూమిన్‌ కూడా ఒకరు.

ఉక్రెయిన్‌ నుంచి క్రిమియాను స్వాధీనం చేసుకోవడంలో కీలకపాత్ర పోషించిన రష్యాకు చెందిన ఇంటిలిజెన్స్ విభాగంలో ఉన్నతస్థాయి బాధ్యతలు నిర్వర్తించారు. అలాగే రక్షణశాఖ సహాయ మంత్రిగా పనిచేసిన ఆయన.. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య విషయంలో అంతర్జాతీయ ఆంక్షలు ఎదుర్కొంటున్నారు. సుదీర్ఘకాలం తన దగ్గర పనిచేసిన సెర్గీ షొయిగును రక్షణమంత్రిగా తొలగించిన తరుణంలో డ్యూమిన్‌కు ప్రమోషన్ లభించింది. ఆర్థికవేత్త, మాజీ ఉప ప్రధాని ఆండ్రీ బెలౌసోవ్‌ రక్షణమంత్రిగా నియమితులయ్యారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు