Putin: మాస్కోలో మారణహోమం.. పుతిన్‌ హెచ్చరిక!

మాస్కోలో జరిగిన ఉగ్ర ఘటన నేపథ్యంలో మార్చి 24న దేశవ్యాప్తంగా సంతాపదినం పాటించాలని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ పిలుపునిచ్చారు. ఈ ఘటనకు కారకులైన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని హెచ్చరించారు.

Published : 24 Mar 2024 00:05 IST

మాస్కో: రష్యా (Russia) రాజధాని మాస్కోలోని (Moscow) అతిపెద్ద సంగీత కచేరీ హాలులో శుక్రవారం జరిగిన మారణకాండపై ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ (Putin) స్పందించారు. ఈ ఘటనను అనాగరిక చర్యగా అభివర్ణించిన ఆయన, దీనికి కారకులైన వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా ఒకరోజు సంతాపదినం పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఉగ్రవాద దుశ్చర్యలో వంద మందికిపైగా పౌరులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. పలువురు క్షతగాత్రులయ్యారు. ఈనేపథ్యంలో పుతిన్‌ జాతినుద్దేశించి ప్రసంగించారు.

‘‘రక్తపాతం సృష్టించిన ఉగ్రవాద చర్యకు సంబంధించి నేను ఇవాళ మీతో మాట్లాడుతున్నాను. ఈ ఘటనలో ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. మార్చి 24న దేశవ్యాప్తంగా సంతాపదినంగా ప్రకటిస్తున్నా’’ అని పుతిన్‌ పేర్కొన్నారు. ఈ ఘటనకు కారకులైన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రత్యక్ష దాడుల్లో పాల్గొన్న నలుగురితోపాటు 11 మందిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించిన ఆయన వారిని ఉపేక్షించబోమని తేల్చి చెప్పారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా అదనపు భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. 

మరోవైపు ముష్కరులకు ఉక్రెయిన్‌తో సంబంధాలున్నాయని తనకు సమాచారం అందినట్లు పుతిన్‌ పేర్కొన్నారు. ఉగ్రవాదులను సరిహద్దులు దాటించేందుకు ఉక్రెయిన్‌కు చెందిన కొందరు సహకరించారని రష్యా మీడియా పేర్కొంది. అయితే ఈ వార్తలను కీవ్‌ ఖండించింది. తమకేమీ సంబంధం లేదని స్పష్టం చేసింది. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధానికి ఈ ఘటనతో సంబంధం ఉన్నట్లు ఇప్పటివరకు ఆధారాలేమీ లేవని అమెరికా వెల్లడించింది. కాగా, ఈ దాడికి పాల్పడింది తామేనంటూ ఇస్లామిక్‌ స్టేట్‌ ఇప్పటికే ప్రకటించుకుంది.

133కి చేరిన మృతుల సంఖ్య

ఉగ్ర ఘటనలో మృతుల సంఖ్య 133కి చేరినట్లు రష్యా తాజాగా వెల్లడించింది. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశమున్నట్లు పేర్కొంది. శుక్రవారం రాత్రి దాదాపు 6,000 మందికి పైగా సామర్థ్యమున్న క్రాకస్‌ సిటీ హాలులో రష్యాలోనే ప్రముఖ బ్యాండ్‌ అయిన ‘పిక్‌నిక్‌’ సంగీత కార్యక్రమం జరుగుతుండగా.. దుండగులు రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. తొలుత బాంబుపేలుళ్లకు, ఆ తర్వాత కాల్పులకు తెగబడ్డారు. ఈక్రమంలో పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో అనేకమంది ప్రాణాలు కోల్పోయారని రష్యా వార్తా సంస్థ ‘టాస్‌’ ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని