Gaza: ‘గాజా’ ఉనికే లేదు..! ఇజ్రాయెల్‌ విధ్వంసంపై ఖతార్‌ ప్రధాని ఆవేదన

ఇజ్రాయెల్‌ కొనసాగిస్తోన్న విధ్వంసంతో గాజా ఇప్పటికే తన ఉనికి కోల్పోయిందని ఖతార్‌ ప్రధానమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.

Published : 17 Jan 2024 01:49 IST

జెరూసలెం: ఇజ్రాయెల్‌ చేస్తోన్న భీకర దాడులతో గాజా (Gaza) వణికిపోతోంది. ఇప్పటికే 24వేల మంది ప్రాణాలు కోల్పోగా వేల సంఖ్యలో నివాసాలు నేలమట్టమయ్యాయి. ఈ క్రమంలో కాల్పుల విరమణను ఇజ్రాయెల్‌ రక్షణశాఖ తిరస్కరించడంపై ఖతార్‌ తీవ్రంగా స్పందించింది. గాజాలో నెలకొన్న పరిస్థితులపై ఇజ్రాయెల్‌తోపాటు అంతర్జాతీయ సమాజంపైనా తీవ్ర విమర్శలు చేసింది. ఈ విధ్వంసంతో గాజా ఇప్పటికే తన ఉనికి కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. తాజా సంక్షోభానికి ముగింపు పలకాలంటే రెండు దేశాల ఏర్పాటు (Two-State solution) అవసరమని పేర్కొంది.

‘గాజా ఉనికే లేదు. ప్రస్తుతం అక్కడ ఇంకేం లేదని అభిప్రాయం. ఎక్కడ చూసినా బాంబులే. శాంతియుతంగా కలిసి ఉండాలని ఇజ్రాయెల్‌ ప్రభుత్వం, అక్కడి రాజకీయ నాయకులు భావించేంత వరకు రెండు దేశాల ఏర్పాటు (Two-State solution) సాధ్యం కాదు. ఈ యుద్ధం ఆపకుండా అవన్నీ జరిగే అవకాశం లేదు’ అని ఖతార్‌ ప్రధానమంత్రి షేక్‌ మహహ్మద్‌ బిన్‌ అబ్దుల్‌ రహమాన్‌ అల్‌ థానే  పేర్కొన్నారు. దావోస్‌లో జరుగుతోన్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం వార్షిక సదస్సులో మాట్లాడుతూ గాజా అంశాన్ని ప్రస్తావించారు.

అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌పై హమాస్‌ ఉగ్రవాదులు జరిపిన మెరుపుదాడి భీకర యుద్ధానికి దారితీసింది. అనంతరం ఇజ్రాయెల్‌ సైన్యం చేస్తోన్న ప్రతిదాడుల్లో ఇప్పటివరకు 24వేల మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. లక్షల మంది నిరాశ్రయులు కావడంతోపాటు అనేక మంది ఆకలితో అల్లాడుతున్నట్లు ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. కాల్పుల విరమణకు ప్రయత్నించినప్పటికీ ఆ ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. హమాస్‌ ఉగ్రవాదుల అంతమే లక్ష్యంగా యుద్ధం కొనసాగుతుందని ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు పేర్కొంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని