Havana Syndrome: హవాన సిండ్రోమ్‌ వెనుక రష్యా గూఢచారులు!

హవాన సిండ్రోమ్‌ వెనుక రష్యా గూఢచారుల హస్తం ఉందని అమెరికా పత్రికలు కథనం ప్రచురించాయి. దీనిని క్రెమ్లిన్‌ కొట్టిపారేసింది.   

Updated : 01 Apr 2024 17:50 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా దౌత్యవేత్తలను ప్రపంచ వ్యాప్తంగా భయపెడుతున్న హవాన సిండ్రోమ్‌ (Havana Syndrome)  వెనుక రష్యా ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అమెరికాకు చెందిన ది ఇన్‌సైడర్‌, సీబీఎస్‌ పత్రికలు సంయుక్తంగా నిర్వహించిన ఇన్వెస్టిగేషన్‌ రిపోర్టులో ఈ మేరకు ఆరోపించాయి. లాత్వియాకు చెందిన రిగా అనే గ్రూప్‌ కూడా వీటితో కలిసి పనిచేసింది. మరో వైపు మాస్కో మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. 

తాజా నివేదికల్లో రష్యా ఇంటెలిజెన్స్‌కు చెందిన 29155 అనే యూనిట్‌ డైరెక్ట్‌ ఎనర్జీ వెపన్స్‌ సాయంతో అమెరికా దౌత్యవేత్తలను లక్ష్యంగా చేసుకొన్నారని పేర్కొన్నారు. హవానా సిండ్రోమ్‌ దాడులు జరిగిన సమయంలో ఆ యూనిట్‌  సభ్యులు సదరు నగరాల్లోనే ఉన్నట్లు తమ వద్ద ఆధారాలున్నాయని పేర్కొంది. ఆ ఏజెంటు చేసిన పనికి బహుమతులు కూడా అందుకొన్నారని ఈ పత్రికలు పేర్కొన్నాయి. దాదాపు 130 కేసులు ఇప్పటివరకు నమోదైనట్లు అమెరికా మీడియా పేర్కొంది. ముఖ్యంగా ఈ కేసులు రష్యా, తైవాన్‌, కొలంబియా, వియత్నాం, ఆస్ట్రియా, చైనా వంటి చోట్ల ఇవి నమోదయ్యాయి.

మాకు సంబంధం లేదు: రష్యా

మరోవైపు రష్యా అధ్యక్ష కార్యాలయమైన క్రెమ్లిన్‌ మాత్రం తమకు హవానా సిండ్రోమ్‌తో సంబంధం లేదని సోమవారం తేల్చిచెప్పింది. ‘‘ఇదేం కొత్త విషయం కాదు. హవానా సిండ్రోమ్‌ పేరిట మీడియాలో విపరీతమైన ప్రచారం చేస్తున్నారు. రష్యాపై ఆరోపణలు చేయడానికి దీనిని మొదటి నుంచి వినియోగిస్తున్నారు. ఏనాడు సరైన ఆధారాలను చూపలేదు’’ అని క్రెమ్లిన్‌ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ పేర్కొన్నారు.   

ఏమిటీ సిండ్రోమ్‌..? లక్షణాలు ఏంటి..?

అమెరికా ఇంటెలిజెన్స్‌తో పాటు వివిధ దేశాల దౌత్యకార్యాలయ అధికారులకు ఎదురైన మానసిక ఆరోగ్య లక్షణాలనే హవానా సిండ్రోమ్‌గా వ్యవహరిస్తున్నారు. దానికి గురైన వారిలో బయట ఎటువంటి శబ్దం లేకున్నా భారీ శబ్దం వినిపించడం, మైగ్రెయిన్, వికారం, జ్ఞాపకశక్తి మందగించడం, మైకం వంటి లక్షణాలు కనిపిస్తున్నట్లు గుర్తించారు. ఈ సిండ్రోమ్‌ను తొలిసారి క్యూబాలోని హవానా నగరంలోని అమెరికా దౌత్య కార్యాలయం సిబ్బందిలో గమనించారు. ఆ నగరం పేరు మీదుగా దీన్ని హవానా సిండ్రోమ్‌గా పిలుస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు