Canada visa: కెనడా కీలక నిర్ణయం.. స్టూడెంట్‌ వీసా డిపాజిట్ రెట్టింపు!

కెనడా స్టూడెంట్‌ పర్మిట్‌ డిపాజిట్‌ను ప్రస్తుతమున్న 10వేల డాలర్ల నుంచి 20వేల డాలర్లకు పెంచుతున్నట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది.

Published : 08 Dec 2023 16:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉన్నత విద్య కోసం కెనడా (Study in Canada) వెళ్లే అంతర్జాతీయ విద్యార్థులపై అక్కడి ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేస్తోంది. స్టడీ పర్మిట్‌ (Student visa) కోసం దరఖాస్తు చేసుకొనే విద్యార్థుల ఆర్థిక సంసిద్ధతను పెంచేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో స్టూడెంట్‌ డిపాజిట్‌ను భారీగా పెంచింది. దీనిని ప్రస్తుతమున్న 10,000 డాలర్ల నుంచి 20,635 డాలర్లకు పెంచుతున్నట్లు ప్రకటించింది. జనవరి 1, 2024 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది.

‘కెనడాలో జీవన వ్యయం (Cost of living in Canada) విషయంలో అంతర్జాతీయ విద్యార్థులు పలు సవాళ్లను ఎదుర్కొంటున్నారు. అందుకే జీవన వ్యయ పరిమితిని సవరిస్తున్నాం. తద్వారా ఇక్కడి పరిస్థితులను వారు అర్థం చేసుకోగలరు. విద్యార్థుల అవసరాలకు తగిన వసతి కల్పనకు ఉన్న మార్గాలను అన్వేషిస్తున్నాం. ఆర్థిక బలహీనత, దోపిడీ నుంచి అంతర్జాతీయ విద్యార్థులను తాజా నిర్ణయాలు రక్షిస్తాయి’ అని కెనడా ఇమ్మిగ్రేషన్‌ మంత్రి మార్క్‌ మిల్లర్‌ (Marc Miller) పేర్కొన్నారు. తాజా నిర్ణయం కేవలం పెరుగుతోన్న జీవన వ్యయానికి సంబంధించే కాకుండా తగిన వసతిని పొందడంలోనూ అంతర్జాతీయ విద్యార్థులకు దోహదపడుతుందన్నారు. వీటితోపాటు అంతర్జాతీయ విద్యార్థులు క్యాంపస్‌ బయట పని పరిమితిపై ఇచ్చిన మినహాయింపు (వారానికి 20 గంటల కంటే ఎక్కువ)ను వచ్చే ఏడాది ఏప్రిల్‌ 30వరకు పొడిగిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే కెనడాలో ఉన్నవారితోపాటు డిసెంబర్‌ 7నాటికి దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ఇది వర్తిస్తుందన్నారు.

కెనడాలో ఉద్యోగాలు దొరకట్లేదు.. హెల్పర్లు, క్యాబ్‌ డ్రైవర్లుగా భారత విద్యార్థులు

కెనడాలో ఉన్నత చదువుల కోసం దరఖాస్తు చేసుకునే వారికి అవసరమైన జీవన వ్యయం డిపాజిట్‌ను అక్కడి ప్రభుత్వం కొన్నేళ్లుగా మార్చలేదు. స్టూడెంట్‌ క్యాడ్‌ కింద నివాస, వసతి కోసం ఒక్కో దరఖాస్తుదారుడు 10వేల డాలర్లు డిపాజిట్‌ చేయాలి. కాలక్రమేణా జీవన వ్యయం పెరగడంతో విద్యార్థులు ఇక్కడకు చేరుకున్న తర్వాత అవి సరిపోవడం లేదని కెనడా ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో వీటి కోసం 20,635 డాలర్లు ఉన్నట్లు దరఖాస్తుదారుడు చూపించాల్సి ఉంటుంది. తొలి ఏడాది ట్యూషన్‌ ఫీజు, ప్రయాణ ఖర్చులకు ఇది అదనం. జనవరి 1, 2024 తర్వాత కొత్తగా దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు ఈ మార్పు వర్తిస్తుందని కెనడా ఇమ్మిగ్రేషన్‌ విభాగం ఓ ప్రకటనలో తెలిపింది. ఇంటర్నేషనల్‌ స్టూడెంట్‌ ప్రోగ్రాంలో సంస్కరణలు చేపట్టనున్నట్లు ఈ ఏడాది అక్టోబర్‌ 27న వెల్లడించిన కెనడా ప్రభుత్వం.. పలు నిర్ణయాలను వెల్లడిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని