FIFA: ఫిఫా ప్రపంచకప్‌లో బెల్జియం ఓటమి.. స్వదేశంలో అల్లర్లు..!

ఫిఫా ప్రపంచకప్‌లో బెల్జియం ఓడిపోవడంతో స్వదేశంలో అల్లర్లు చోటుచేసుకున్నాయి. వందలాది మంది అభిమానులు రోడ్లపైకి చేరి ఆందోళనలు చేపట్టారు.

Updated : 28 Nov 2022 11:04 IST

బ్రస్సెల్స్‌: ఫుట్‌బాల్‌లో ప్రపంచ నంబర్‌ 2 జట్టు అయిన బెల్జియం జట్టుకు ఫిఫా ప్రపంచకప్‌లో గట్టి షాక్‌ తగిలింది. మొరాకో చేతిలో 0-2తో ఘోర పరాభవాన్ని చవిచూసింది. అయితే ఈ ఓటమి బెల్జియంలో అల్లర్లకు దారితీసింది. జట్టుపై ఆగ్రహానికి గురైన అభిమానులు రోడ్లపైకి చేరి ఆందోళనలు చేపట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.

ఆదివారం మ్యాచ్‌ పూర్తవ్వగానే బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో వందలాది మంది సాకర్‌ అభిమానులు రోడ్లపైకి చేరి ఆందోళనలు చేపట్టారు. కార్లు, ఎలక్ట్రిక్‌ స్కూటర్లకు నిప్పు పెట్టారు. పరిస్థితి తీవ్రంగా మారడంతో రంగంలోకి దిగిన పోలీసులు జలఫిరంగులు, బాష్పవాయువు ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు. పలువురు నిరసనకారులను అరెస్టు చేశారు. అల్లర్ల కారణంగా పలు చోట్ల ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది.

అటు బెల్జియం పొరుగుదేశమైన నెదర్లాండ్స్‌లోని తీర నగరం రోటర్‌డామ్‌లోనూ ఇలాంటి అల్లర్లే చోటుచేసుకున్నాయి. సాకర్‌ అభిమానులు పోలీసులపైకి టపాసులు విసిరారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. బెల్జియం, డచ్‌లోని పలు నగరాల్లో మొరాకో వలసదారులు ఆశ్రయం పొందుతున్నారు. నిన్నటి మ్యాచ్‌లో మొరాకో విజయం సాధించగానే వలసదారులు వేడుకలు చేసుకుంటుండగా.. కొందరు ఈ అల్లర్లకు పాల్పడినట్లు తెలుస్తోంది.

ఆదివారం నాటి మ్యాచ్‌లో అనూహ్య ప్రదర్శన చేసిన మొరాకో.. 2-0తో బెల్జియంపై సంచలన విజయం నమోదు చేసింది. ప్రపంచకప్‌ చరిత్రలో అ జట్టుకిది మూడో గెలుపు మాత్రమే. ఈ విజయంతో గ్రూప్‌-ఎఫ్‌లో మొరాకో అగ్రస్థానానికి చేరుకుంది. మరోవైపు, ఈ మ్యాచ్‌లో ఓటమి చవిచూసిన బెల్జియం జట్టుకు.. ప్రపంచకప్‌ ఆశలు అనిశ్చితిలో పడ్డాయి. బెల్జియం నాకౌట్‌కు చేరాలంటే.. తన చివరి మ్యాచ్‌లో గత ప్రపంచకప్‌ రన్నరప్‌ క్రొయేషియాపై తప్పక నెగ్గాల్సిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని