Britain-Greek: పురాతన శిల్పాల వివాదం.. ప్రధానుల భేటీ రద్దు

పురాతన శిల్పాలను తిరిగిచ్చే విషయంలో తలెత్తిన వివాదం కారణంగా.. గ్రీస్‌ ప్రధానితో సమావేశాన్ని బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ రద్దు చేసుకున్నారు. 

Published : 28 Nov 2023 13:26 IST

లండన్‌: పురాతన శిల్పాలను తిరిగిచ్చే విషయంలో తలెత్తిన వివాదం.. బ్రిటన్ - గ్రీస్‌ మధ్య దౌత్యపరమైన వివాదానికి కారణమైంది. దీంతో బ్రిటన్‌ ప్రధానిపై గ్రీస్‌ ప్రధాని ఆరోపణలు చేశారు. వివరాల్లోకి వెళితే.. బ్రిటన్‌ (Britain) ప్రధాని రిషి సునాక్‌ (Rishi Sunak) మంగళవారం లండన్‌లో గ్రీస్‌ (Greece) ప్రధాని కిరియాకోస్‌ మిత్సటాకిస్‌ (Kyriakos Mitsotakis)తో సమావేశం కావాల్సి ఉంది. అనూహ్యంగా ఈ భేటీని రిషి సునాక్‌ రద్దు చేసుకున్నారు. బ్రిటిష్‌ మ్యూజియంలో ఉన్న 2,500 ఏళ్లనాటి పార్థినాన్‌ శిల్పాలను తిరిగిచ్చే విషయంలో గ్రీస్‌ పట్టుదలగా ఉండటం, దాని గురించి ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉందన్న అనుమానాలతో భేటీని రద్దు చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. ‘‘ కేవలం శిల్పాల కోసం సమావేశం నిర్వహించాలనుకుంటే.. అది సరైంది కాదు’’ అని బ్రిటన్‌ ప్రభుత్వాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. వాటిని గ్రీస్‌కు తిరిగి ఇచ్చే ఆలోచన తమకు లేదని తెలిపారు. 

‘‘పార్థినాన్‌ శిల్పాల విషయంలో గ్రీస్‌ వైఖరిని ఇప్పటికే స్పష్టం చేశాం. బ్రిటన్‌ ప్రధానితో వీటి గురించి చర్చించే అవకాశం ఉంటుందని ఆశించా. తమ పదవి ప్రాధాన్యత, దానిపై న్యాయపరమైన నమ్మకం కలిగిన వారు ఇతరుల వాదనలు ఎదుర్కొనేందుకు భయపడరు. ముందే షెడ్యూల్‌ చేసిన సమావేశాన్ని కొన్ని గంటల ముందు బ్రిటన్‌ ప్రధాని రద్దు చేయడంపై నాకు కలిగిన చిరాకును వారికి తెలియజేస్తాను’’ అని గ్రీస్‌ ప్రధాని తెలిపారు. పార్థినా శిల్పాలను బ్రిటన్‌ మ్యూజియంలో ఉంచడం అంటే.. మోనాలిసా పెయింటింగ్‌ను రెండు భాగాలు చేయడంతో సమానమని కిరియాకోస్‌ మిత్సటాకిస్‌ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత సమస్య ఆ శిల్పాల యజమాని ఎవరనే దాని గురించి కాదు, వాటిని ఒక్కటిగా కలపడం గురించని కిరియాకోస్‌ బీబీసీ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. 

మరోవైపు గ్రీస్‌ ప్రధానితో సమావేశం రద్దుపై బ్రిటన్‌ ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ‘‘గ్రీస్‌తో సంబంధాలు కలిగి ఉండటం బ్రిటన్‌కి ఎంతో ముఖ్యం. అక్రమ వలసలపై ఇరు దేశాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది’’ అని తెలిపింది. అయితే, గ్రీస్‌ ప్రధానితో చర్చలు జరిపేందుకు ప్రధాని రిషి సునాక్‌కి బదులు, ఉప ప్రధాని ఒలివర్‌ డౌడెన్‌ అందుబాటులో ఉంటారని ప్రకటనలో పేర్కొంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని