Ukraine Crisis: ఉక్రెయిన్‌- రష్యా యుద్ధం.. 150 మంది ఖైదీల విడుదల

ఉక్రెయిన్‌, రష్యాల మధ్య యూఏఈ జరిపిన చర్చల ఫలితంగా రెండు దేశాలూ చెరో 75 మంది యుద్ధ ఖైదీలను విడుదల చేశాయి.

Published : 31 May 2024 22:44 IST

కీవ్‌: సుదీర్ఘ కాలంగా యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్‌ (Ukraine), రష్యా (Russia) దేశాల మధ్య యుద్ధ ఖైదీల (War prisoners) విడుదలకు మధ్యవర్తిత్వం నెరిపి యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE) విజయం సాధించింది. ఫలుదఫాలుగా జరిపిన చర్చల ఫలితంగా ఇరుదేశాలు చెరో 75 మంది చొప్పున యుద్ధ ఖైదీలను విడుదల చేశాయి. రష్యా నుంచి ఉక్రెయిన్‌కు చెందిన 75 మంది తిరిగి వచ్చినట్లు ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వెల్లడించారు. ఇందులో నలుగురు సాధారణ పౌరులుకాగా.. మిగతా వారంతా సైనికులేనని తెలిపారు. 

మరోవైపు, యూఏఈ చర్చల ఫలితంగా తమ దేశానికి చెందిన 75 మందిని ఉక్రెయిన్‌ విడుదల చేసిందని రష్యా రక్షణశాఖ వెల్లడించింది. ‘‘ దాదాపు 4 నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఖైదీల మార్పిడి జరిగింది. 75 మంది సైనికులు, పౌరులను శత్రుదేశం విడుదల చేసింది’’ అని ఉక్రెయిన్‌ కోఆర్డినేటింగ్ కమిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. అంతేకాకుండా ఉక్రెయిన్‌కు చెందిన 212 మంది మృతదేహాలను కూడా రష్యా తమకు అప్పగించినట్లు తెలిపింది.

తాజాగా రష్యా విడుదల చేసిన వారిలో ఉక్రెయిన్‌ పరిధిలోని స్నేక్‌ ఐలాండ్‌ (పాముల ద్వీపం)లో విధులు నిర్వర్తించిన 19 మంది సైనికులు కూడా ఉన్నారు. ఇది నల్ల సముద్రంలోని ఓ ద్వీపం. యుద్ధం ప్రారంభంలో ఉక్రేనియన్‌ గార్డులు, రష్యా దళాలకు మధ్య ఇక్కడే భారీ ఘర్షణ చోటు చేసుకుంది. రష్యా సైనికులకు లొంగిపోయేందుకు వారు నిరాకరించారు. దీంతో రష్యాపై ఉక్రెయిన్‌ ధిక్కారానికి ఈ ప్రాంతం చిహ్నంగా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని