Russia-Ukraine: రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం.. దూసుకొస్తున్న డ్రోన్‌లు!

Ukraine-Russia: ఉక్రెయిన్‌, రష్యా పరస్పరం డ్రోన్‌ దాడులను తీవ్రతరం చేశాయి. గత రెండు రోజుల్లోనే పదుల సంఖ్యలో డ్రోన్లను నేల కూల్చినట్లు ఇరుదేశాలు ప్రకటించాయి.

Published : 17 Dec 2023 22:07 IST

కీవ్‌: రష్యా- ఉక్రెయిన్‌ (Russia-Ukrarine War) యుద్ధం మొదలై దాదాపు రెండేళ్లు కావస్తున్నా పరిస్థితులు సద్దుమణగడం లేదు. కొన్నాళ్లపాటు దాడులు చేయకుండా స్తబ్దుగా ఉన్న రష్యా.. ఇటీవల కాలంలో మళ్లీ తీవ్రం చేసింది. ఉక్రెయిన్‌ కూడా దీటుగా బదులిస్తోంది. ఆదివారం రష్యా (Russia), ఉక్రెయిన్‌ (Ukraine) పరస్పరం డ్రోన్లతో విరుచుకుపడ్డాయి. రష్యా ఆక్రమిత ఉక్రెయిన్‌ దక్షిణ ప్రాంతంలోని మిలటరీ ఎయిర్‌బేస్‌ లక్ష్యంగా ఉక్రెయిన్‌ డ్రోన్లతో దాడికి దిగింది. పదుల సంఖ్యలో డ్రోన్లతో దాడిచేసింది. అప్రమత్తమైన రష్యా బలగాలు వాటిని కూల్చి వేశాయి. ఈ క్రమంలో డ్రోన్‌ శిథిలాలు ఇంటిమీద పడి ఓ ఉక్రెయిన్ పౌరుడు ప్రాణాలు కోల్పోయినట్లు రష్యా వెల్లడించింది. గత రెండు రోజుల్లోనే ఉక్రెయిన్‌కు చెందిన 35 డ్రోన్‌లను ధ్వంసం చేసినట్లు ఆ దేశ రక్షణశాఖ పేర్కొంది. ఈ ఎయిర్‌బేస్ నుంచే నల్లసముద్ర తీరంలోని ఉక్రెయిన్‌ శిబిరాలపై రష్యా దాడులకు పాల్పడుతోంది. దానిని ధ్వంసం చేస్తే తమకు ముప్పు తప్పడమే కాకుండా.. ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవచ్చని ఉక్రెయిన్‌ భావిస్తోంది. దీనికోసం గత కొన్ని రోజులుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.

మరోవైపు ఆదివారం ఉదయం ఉక్రెయిన్‌ స్థావరాలే లక్ష్యంగా రష్యా ప్రయోగించిన 20 డ్రోన్‌లను కూల్చేసినట్లు ఆ దేశ వైమానిక దళం వెల్లడించింది. ఈ డ్రోన్‌లన్నీ ఇరాన్‌లో తయారైనట్లు గుర్తించింది. ఎక్స్‌-59 క్రూయిజ్‌ క్షిపణిని కూడా రష్యా ప్రయోగించిందని,  అయితే, ఉక్రెయిన్‌ బలగాలు దానిని కూడా కూల్చేశాయని కీవ్ రక్షణశాఖ అధికారులు తెలిపారు. రష్యా జరిపిన దాడుల్లో నల్లసముద్రం దక్షిణ తీరంలో ఓ పౌరుడు ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. గత నెల రోజులుగా ఇరుదేశాల మధ్య డ్రోన్‌ దాడులు ఎక్కువయ్యాయి. యుద్ధం మొదలై రెండేళ్లు కావస్తున్నా.. ఇంకా తాము పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రత్యర్థులకు పరోక్షంగా చెప్పేందుకే రెండు దేశాలూ దాడులు తీవ్రతరం చేసినట్లు తెలుస్తోంది. 

క్రిమియా ద్వీపకల్పంపై ఉక్రెయిన్‌ దాడులకు పాల్పడగా.. తమ యాంటీ ఎయిర్‌క్రాప్ట్‌ యూనిట్లు 32 డ్రోన్లను ధ్వంసం చేశాయని శుక్రవారం కూడా రష్యా ఓ ప్రకటన విడుదల చేసింది. ఉక్రెయిన్‌కు చెందిన ఈ భూభాగాన్ని 2014లో రష్యా స్వాధీనం చేసుకుంది. ఉక్రెయిన్‌లోని 11 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని రష్యా 31 డ్రోన్లతో దాడి చేయగా వాటిని గాల్లోనే కూల్చేసినట్లు శనివారం ఉక్రెయిన్‌ ప్రకటించింది. ఫిబ్రవరి, 2022లో రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం మొదలైన సంగతి తెలిసిందే. ప్రపంచ దేశాల ఒత్తిడి, రక్షణ శాఖ అధికారుల సూచన మేరకు రష్యా కొన్ని రోజులు యుద్ధానికి  బ్రేక్‌ ఇచ్చినప్పటికీ.. దాదాపు రెండేళ్లుగా యుద్ధం కొనసాగుతూనే ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని