Russia: ఉక్రెయిన్‌లో రష్యా దారుణాలు.. 77 మంది ఊచకోత

ఉక్రెయిన్‌ (Ukraine)లో రష్యా (Russia) సాగిస్తున్న దండయాత్రలో అనేక దారుణాలు వెలుగుచూస్తున్నాయి. పౌరులను అక్రమంగా నిర్బంధించి మాస్కో వారిపై అకృత్యాలకు పాల్పడుతున్నట్లు ఐరాస మిషన్‌ తెలిపింది.

Published : 27 Jun 2023 16:32 IST

జెనీవా: ఏడాదిన్నరకు పైగా ఉక్రెయిన్‌ (Ukraine)పై దండయాత్ర సాగిస్తున్న రష్యా (Russia).. సైనిక చర్య పేరుతో ఆ దేశంలో అనేక దారుణాలకు ఒడిగడుతోంది. ఉక్రెయిన్‌ పౌరులపై మాస్కో సైన్యం అకృత్యాలకు పాల్పడినట్లు గతంలో వార్తలు వచ్చాయి. తాజాగా ఐక్యరాజ్యసమితి (United Nations) బృందం జరిపిన పరిశోధనలోనూ మరోసారి ఆ విషయం బయటపడింది. ఈ ఘర్షణ మొదలైన నాటి నుంచి రష్యా దాదాపు 800 మందికి పైగా పౌరులను నిర్బంధించినట్లు ఉక్రెయిన్‌లోని ఐరాస (UN) పర్యవేక్షణ మిషన్‌ మంగళవారం వెల్లడించింది. ఇందులో 77 మందిని చంపేసినట్లు తెలిపింది.

‘‘సైనిక చర్య పేరుతో జరుగుతున్న ఈ దండయాత్రలో  మానవహక్కుల నిబంధనల ఉల్లంఘన ఎక్కువగా ఉంది. అక్రమంగా పౌరులను నిర్బంధించడం, వారిని హింసించడం, కొందరిని బలవంతంగా కన్పించకుండా చేయడం వంటి దారుణాలను గుర్తించాం. ఉక్రెయిన్‌ (Ukraine), రష్యా (Russia) రెండు దేశాలు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి ఇలా నిర్బంధాలకు పాల్పడ్డాయి. అయితే, ఉక్రెయిన్‌ వైపు నుంచి ఈ నిర్బంధాల సంఖ్య చాలా తక్కువగా ఉండగా.. రష్యా బలగాలు అత్యధిక దారుణాలకు పాల్పడ్డాయి. దాదాపు 800మందికి పైగా ఉక్రెయిన్‌ పౌరులను వారు నిర్బంధించారు. అందులో 77 మందిని ఊచకోత కోశారు’’ అని ఐరాస మిషన్‌ తమ నివేదికలో వెల్లడించింది.

గతేడాది ఫిబ్రవరిలో రష్యా మొదలుపెట్టిన ఈ దండయాత్ర ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ సహా పలు ప్రాంతాలపైకి మాస్కో సేనలు డ్రోన్లు, క్షిపణి దాడులకు పాల్పడుతూనే ఉన్నాయి. అయితే రష్యా దాడులను ఉక్రెయిన్‌ ఎప్పటికప్పుడు దీటుగా ఎదుర్కొంటోంది. శత్రు డ్రోన్లు, క్షిపణులను కూల్చేస్తోంది. మరోవైపు, రష్యాను ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్‌కు పలు దేశాలు ఆయుధ సాయాన్ని కొనసాగిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని