Ukraine-Russia: రాత్రికి రాత్రే.. డ్రోన్‌లు, క్షిపణులతో విరుచుకుపడిన రష్యా!

Ukraine-Russia| శనివారం రాత్రి రష్యా 28 డ్రోన్‌లు, 3 క్రూజ్‌ క్షిపణులతో దాడికి పాల్పడినట్లు ఉక్రెయిన్‌ ఆరోపించింది.

Updated : 07 Jan 2024 16:00 IST

కీవ్‌: రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం (Russia-Ukrarine War) మొదలై దాదాపు రెండేళ్లవుతున్నా పరిస్థితులు సద్దుమణగడం లేదు. కొన్నాళ్లపాటు స్తబ్దుగా ఉన్న రష్యా.. ఇటీవల కాలంలో మళ్లీ దాడులను తీవ్రం చేసింది. శనివారం రాత్రే 28 డ్రోన్‌లు, మూడు క్రూజ్‌ క్షిపణులతో విరుచుకుపడినట్లు ఉక్రెయిన్‌ ఆరోపించింది. అందులో 21 డ్రోన్లను విజయవంతంగా కూల్చేసినట్లు ఆ దేశ వైమానిక దళం అధికారిక టెలిగ్రామ్‌ ఛానల్‌లో పోస్టు చేసింది. క్రూజ్‌ క్షిపణుల  గురించి ప్రస్తావించలేదు. రష్యా ప్రధానంగా తూర్పు, దక్షిణ ఉక్రెయిన్‌ ప్రాంతాలపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపింది.

‘‘శత్రువులు దాడి వ్యూహాన్ని మార్చారు. దక్షిణ ఉక్రెయిన్‌లోని ఖేర్సన్‌, నిప్రోపెట్రోవ్స్క్‌ ప్రాంతాలపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు’’ అని ఉక్రెయిన్‌ వైమానికదళ అధికార ప్రతినిధి యురీ ఇహ్నాట్‌ తెలిపారు. శత్రు డ్రోన్లను చిన్నపాటి ఆయుధాలతోనే కీవ్‌ సేనలు ధ్వంసం చేశాయని.. ఎయిర్‌ డిఫెన్స్‌ క్షిపణులను ఆదా చేశాయని ఆయన పేర్కొన్నారు.

రష్యా తాజా దాడుల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని కీవ్‌ తెలిపింది. ఉక్రెయిన్‌ వ్యాఖ్యలపై రష్యా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇటీవల కాలంలో రష్యా దాదాపు 300 క్షిపణులు, 200కి పైగా డ్రోన్లను ప్రయోగించినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి, 2022 నుంచి రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం మొదలైన సంగతి తెలిసిందే. ప్రపంచ దేశాల ఒత్తిడి, రక్షణ శాఖ అధికారుల సూచన మేరకు రష్యా కొన్ని రోజులు బ్రేక్‌ ఇచ్చినప్పటికీ.. యుద్ధం కొనసాగుతూనే ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని