Russia: మరోసారి ఉక్రెయిన్‌పై డ్రోన్లతో విరుచుకుపడ్డ రష్యా..!

బెల్గోరోడ్‌పై దాడికి ప్రతీకారంగా డ్రోన్లతో ఉక్రెయిన్‌పై రష్యా విరుచుకుపడింది. ఈ దాడిలో చాలా నివాస సముదాయాలు దెబ్బతిన్నట్లు కీవ్‌ చెబుతోంది.

Updated : 31 Dec 2023 15:31 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రష్యా నేడు మరోసారి ఉక్రెయిన్‌పై డ్రోన్లతో విరుచుకుపడింది. రాజధాని కీవ్‌, ఖర్కీవ్‌ నగరాల్లోని జనావాసాలపై భారీ స్థాయిలో డ్రోన్లు దాడులు జరిపాయి. రష్యాలోని సరిహద్దు నగరమైన బెల్గోరోడ్‌పై శుక్ర, శనివారాల్లో ఉక్రెయిన్‌ బలగాలు చేసిన దాడులకు ప్రతీకారంగానే ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే కీవ్‌లోని ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలు కొన్ని డ్రోన్లను కూల్చివేసినట్లు ఉక్రెయిన్‌ చెబుతోంది. ఖర్కీవ్‌ నగరంలో కేఫ్‌లు, అపార్ట్‌మెంట్‌ భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ విషయాన్ని అక్కడి నగర మేయర్‌ ధ్రువీకరించారు. 

శుక్రవారం నాడు రష్యా దళాలు కీవ్‌పై క్షిపణితో దాడి చేయడంతో 39 మంది మరణించిన విషయం తెలిసిందే. 160 మంది గాయపడ్డారు. గత రెండ్రోజుల నుంచి రష్యాపై కీవ్‌ దళాలు కూడా వరుసగా దాడులు చేసిన విషయం తెలిసిందే. ఇక ఖర్కీవ్‌పై శనివారం జరిపిన దాడుల్లో 19 మంది గాయపడ్డారు.

రష్యాలోని సరిహద్దు నగరమైన బెల్గోరోడ్‌పై శుక్ర, శనివారాల్లో ఉక్రెయిన్‌ బలగాలు దాడులు చేశాయి. ఈ ఘటనల్లో 14 మంది మరణించారని, పలువురు గాయపడ్డారని ప్రాంతీయ గవర్నర్‌ వ్యాకెస్లావ్‌ గ్లాడ్‌కోవ్‌ తెలిపారు. పలు కార్లు మంటల్లో కాలిపోయాయని వివరించారు. సాధారణంగా ఈ ప్రాంతంలో ఉక్రెయిన్‌ దళాలు రాత్రి సమయంలో దాడులు చేస్తాయని, ఈసారి పగలే నగరం నడిబొడ్డున విరుచుకుపడ్డాయని గవర్నర్‌ తెలిపారు. 32 ఉక్రెయిన్‌ డ్రోన్లను కూల్చేశామని రష్యా అధికారులు ప్రకటించారు. మరోవైపు నల్ల సముద్రంలో రష్యాకు చెందిన ఓ భారీ సైనిక రవాణా నౌకను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్‌ దాడి చేసింది. ఈ ఘటనలో నౌక ధ్వంసమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని