Russia: పుతిన్‌ ప్రాణాలపై ఉక్రెయిన్‌ గురి.. ఎలా కాపాడుకోవాలో తెలుసన్న రష్యా

Ukraine Crisis: ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం 15 నెలలుగా ముగింపు లేకుండా సాగుతోంది. రోజురోజుకూ ఆ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి.  తాజాగా వాటిల్లో ఆజ్యం పోసే విధంగా ఉక్రెయిన్‌ ప్రకటన జారీ చేసింది. 

Published : 26 May 2023 11:08 IST

మాస్కో: తమ కిల్‌ లిస్ట్‌(హత్యల జాబితా)లో రష్యా అధ్యక్షుడు పుతిన్(Russia President Vladimir Putin) తొలిస్థానంలో ఉన్నారని ఉక్రెయిన్‌ నిఘా అధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి రష్యా(Russia) నుంచి దీటైన కౌంటర్ వచ్చింది. పుతిన్ భద్రత విషయంలో ఏం చేయాలో తమ సిబ్బందికి తెలుసని బదులిచ్చారు. (Ukraine Crisis)

ఉక్రెయిన్‌ మిలిటరీ ఇంటిలిజెన్స్ సర్వీస్‌కు చెందిన వాదిమ్‌ స్కిబిట్స్కీ ఓ అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ .. ‘కీవ్‌ పుతిన్‌ను హత్య చేయాలని అనుకుంటోంది. ఎందుకంటే యుద్ధంలో ఏం జరగాలనేది ఆయనే నిర్ణయిస్తున్నారు. మా కిల్‌ లిస్ట్‌లో తొలివరుసలో ఆయన పేరే ఉందని పుతిన్‌(Putin)కు తెలుసు. మేం చేరువగా వస్తున్నామని పుతిన్‌ గుర్తించారు. అలాగే సొంత వ్యక్తుల చేతిలో ప్రాణాలు కోల్పోతాననే భయంతో జీవిస్తున్నారు. మా జాబితాలో పుతిన్‌తో పాటు రష్యా ప్రైవేటు సైన్యం వాగ్నర్‌ గ్రూపు అధిపతి యెవ్‌గెనీ ప్రిగోజిన్‌, రక్షణ శాఖ మంత్రి సెర్గీ షొయిగు, ఆర్మీ ఉన్నతాధికారులు ఉన్నారు. పుతిన్‌ను టార్గెట్ చేయడం కష్టసాధ్యం. ఎందుకంటే ఆయన ఎక్కువగా సురక్షిత ప్రాంతాలకే పరిమితం అవుతున్నారు. కానీ, ఇటీవల తరచూ బహిరంగ కార్యక్రమాల్లో కనిపిస్తున్నారు’అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాగే ప్రతిఒక్కరు తమ చర్యలకు సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు.

ఈ వ్యాఖ్యల నేపథ్యంలో పుతిన్‌ రక్షణను మరింత కట్టుదిట్టం చేస్తారా? అని ప్రశ్నించగా.. క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్‌ ఘాటుగా సమాధానం ఇచ్చారు. ‘మమ్మల్ని నమ్మండి. మా భద్రతా సిబ్బందికి వారు ఏం చేస్తున్నారో, ఏం చేయాలో తెలుసు’అని బదులిచ్చారు. తాము 15 నెలల క్రితం ప్రారంభించిన సైనిక చర్య సరైందని ఉక్రెయిన్ అధికారి వ్యాఖ్యలు చెబుతున్నాయని మండిపడ్డారు. ఇదిలా ఉంటే.. కొద్దిరోజుల క్రితం రష్యా నివాస, అధ్యక్ష కార్యాలయాలున్న క్రెమ్లిన్‌(Kremlin)పై రెండు డ్రోనులతో దాడి యత్నం జరిగింది. ఈ దాడి వెనక కీవ్‌ హస్తం ఉందని అప్పట్లో రష్యా ఆరోపించగా.. ఉక్రెయిన్(Ukraine) దానిని ఖండించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని