UNSC: రష్యా చేతికి యూఎన్‌ఎస్‌సీ పగ్గాలు.. ‘చెత్త జోక్‌’గా పేర్కొన్న ఉక్రెయిన్‌!

ఐరాస భద్రతామండలి(UNSC) అధ్యక్ష బాధ్యతలు ఏప్రిల్ నెలకుగానూ రష్యా చేతుల్లోకి వెళ్లాయి. సైనిక చర్య వేళ.. రష్యాకు ఈ బాధ్యతలు దక్కడంపై ఉక్రెయిన్‌ మండిపడింది.

Published : 02 Apr 2023 01:32 IST

వాషింగ్టన్‌: ఉక్రెయిన్‌ (Ukraine)పై రష్యా దండయాత్ర కొనసాగుతోన్న వేళ.. కీలక ఐరాస భద్రతామండలి (UNSC) అధ్యక్ష బాధ్యతలు రష్యా (Russia) చేతుల్లోకి వెళ్లాయి. యూఎన్‌ఎస్‌సీలో శాశ్వత సభ్య దేశమైన రష్యా.. ఏప్రిల్ నెలకుగానూ ఈ మేరకు బాధ్యతలు చేపట్టింది. అయితే.. ఉక్రెయిన్‌పై దాడులు, రష్యా అధ్యక్షుడు పుతిన్‌(Putin)కు అంతర్జాతీయ న్యాయస్థానం(ICC) అరెస్టు వారెంట్‌ జారీ, బెలారస్‌ (Belarus)లో వ్యూహాత్మక అణ్వాయుధాల మోహరింపు వంటి పరిణామాల వేళ.. రష్యాకు యూఎన్‌ఎస్‌సీ అధ్యక్ష బాధ్యతలు దక్కడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉక్రెయిన్‌, అమెరికాలు దీన్ని తప్పుబట్టాయి.

రష్యా అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం.. ప్రపంచంలోనే ‘చెత్త జోక్‌’ అని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా పేర్కొన్నారు. అంతర్జాతీయ భద్రత వ్యవస్థ పనితీరులోనే ఏదో లోపం ఉందని ఇది గుర్తుచేస్తోందన్నారు. ‘అంతర్జాతీయ భద్రత నియమాలను ఉల్లంఘించే ఓ దేశం.. ఇప్పుడు అంతర్జాతీయ భద్రతను కాపాడటమే లక్ష్యంగా పనిచేస్తోన్న ఓ సంస్థకు అధ్యక్షత వహిస్తోంది’ అని కులేబా వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు. ‘దురదృష్టవశాత్తూ.. యూఎన్‌ఎస్‌సీలో రష్యా ఓ శాశ్వత సభ్యదేశం. దీన్ని మార్చేందుకు చట్టపరమైన మార్గాలు లేవు’ అని వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రెటరీ కెరీన్‌ జీన్‌ పెర్రీ వ్యాఖ్యానించారు. యూఎన్‌ఎస్‌సీ అధ్యక్ష హోదాలో రష్యా బాధ్యతగా వ్యవహరించాలన్నారు.

ఇదిలా ఉండగా.. ఐరాస భద్రతామండలిలో 15 సభ్యదేశాలు ఉంటాయి. వీటిలో ఐదు శాశ్వత సభ్యదేశాలు.. రష్యా, చైనా, అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లు ఉన్నాయి. కౌన్సిల్‌లో మిగతా 10 సభ్యదేశాలను రెండేళ్ల కాలానికి ఐరాస జనరల్ అసెంబ్లీ ఎన్నుకుంటుంది. అల్బేనియా, బ్రెజిల్‌, ఈక్వెడార్‌, గబాన్‌, ఘనా, జపాన్‌, మాల్టా, మొజాంబిక్‌, స్విట్జర్లాండ్‌, యూఏఈలు ప్రస్తుతం తాత్కాలిక సభ్యదేశాలుగా ఉన్నాయి. ఆంగ్ల అక్షర క్రమం ప్రకారం ఇవి నెలవారీ అధ్యక్ష బాధ్యతలు చేపడతాయి. రష్యా చివరిసారి 2022 ఫిబ్రవరిలో ఈ బాధ్యత నిర్వర్తించింది. అదే నెలలో ఉక్రెయిన్‌పై పుతిన్‌ దండయాత్ర ప్రకటించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని