Spy Network: ఆంక్షల వేళ.. యూరప్‌ నుంచి రష్యా స్మగ్లింగ్‌..!

ఉక్రెయిన్‌పై యుద్ధం (Ukraine Crisis) కారణంగా రష్యాపై పాశ్చాత్య దేశాల ఆంక్షలు విధిస్తున్నప్పటికీ యూరోపియన్‌ యూనియన్‌ నుంచి (Russia) రహస్యంగా ఆయుధాలు కొనుగోలు చేస్తుందని తాజా నివేదిక వెల్లడించింది. రష్యాకు చెందిన ఓ నిఘా సంస్థ వీటిని సమకూరుస్తున్నట్లు తేలింది.

Published : 05 May 2023 01:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉక్రెయిన్‌పై దండయాత్రలో (Russian Invasion) భాగంగా రష్యా.. ఏడాదికిపైగా తీవ్ర దాడులకు తెగబడుతోన్న విషయం తెలిసిందే. దీంతో పుతిన్‌ సేనలకు అడ్డుకట్ట వేసే ప్రయత్నాల్లో భాగంగా పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని (Ukraine Crisis) మరింత తీవ్రతరం చేసేందుకు గాను ఐరోపా (EU) కంపెనీల నుంచి సున్నితమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని రష్యాకు చెందిన ఓ నిఘా విభాగం అక్రమంగా తరలించినట్లు తాజా నివేదిక వెల్లడించింది.

అమెరికా ఆంక్షలు ఉన్నప్పటికీ రష్యాకు చెందిన ఓ సంస్థ జర్మనీ, ఫిన్లాండ్‌ల నుంచి కీలక మెషిన్‌ టూల్స్‌ను పొందగలిగిందట. మైక్రోచిప్స్‌, సర్య్కూట్‌ బోర్డులు, ఇతర ఉపకరణాలు కలిసి మొత్తంగా ఒక మిలియన్‌ డాలర్ (సుమారు రూ.8కోట్లు) విలువైన సాంకేతికతను సేకరించిందని ఓ నివేదిక వెల్లడించింది. కేవలం జర్మనీ నుంచే 22టన్నుల విడిభాగాలను రష్యా నిఘా సంస్థ కొనుగోలు చేసిందని.. మారుపేరుతో ఈ వ్యవహారం నడిచిందని తెలిపింది. ఇలా రహస్యంగా సేకరించిన ఈ సాంకేతికత, పరికరాలతో హైపర్‌సోనిక్‌ ఆయుధాలను అభివృద్ధి చేయొచ్చని నివేదిక పేర్కొంది.

రష్యా నిఘా సంస్థకు ఇలా మందుగుండు సామగ్రి, ఆయుధాలు అమ్మినట్లు యూరోపియన్‌ కంపెనీలకు తెలియదని తాజా నివేదిక వెల్లడించింది. అయితే, ఇది ఎప్పటినుంచో సాగే అక్రమ వ్యవహారమని, రష్యా యుద్ధం మొదలుపెట్టిన తర్వాతే మొదలుకాలేదని ఎస్తోనియాకు చెందిన ఓ మంత్రి పేర్కొన్నారు. సుమారు పది, పదిహేనేళ్ల నుంచి ఇటువంటి అక్రమ విక్రయాలు కొనసాగుతున్నాయని.. ఇటీవల ఇది తీవ్రరూపం దాల్చిందని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని