Isreal: హమాస్‌కు రష్యా మద్దతిస్తోంది: జెలెన్‌స్కీ

ఇజ్రాయెల్‌పై దాడి చేసిన ఉగ్రవాద సంస్థ హమాస్‌కు రష్యా మద్దతిస్తోందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు. ప్రపంచం తమ దేశాన్ని పక్కన పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

Published : 11 Oct 2023 03:55 IST

కీవ్‌: ఇజ్రాయెల్‌(Israel), హమాస్‌ (Hamas) మధ్య భీకర పోరు కొనసాగుతోన్న వేళ ఉక్రెయిన్‌ (Ukraine) అధ్యక్షుడు జెలెన్‌స్కీ రష్యాపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇజ్రాయెల్‌పై దాడి చేసిన పాలస్తీనాకు చెందిన ఉగ్రవాద సంస్థ హమాస్‌కు రష్యా మద్దతిస్తోందన్నారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఉక్రెయిన్‌, ఇజ్రాయెల్‌లో ప్రస్తుత పరిస్థితులపై మాట్లాడారు. 

‘‘ఇజ్రాయెల్‌లో హమాస్‌ కార్యకలాపాలకు రష్యా ఏదో ఒక విధంగా మద్దతు ఇస్తోందని మేము భావిస్తున్నాం. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్ని పరిశీలిస్తే.. ప్రపంచాన్ని అస్థిరపర్చేందుకు రష్యా ప్రయత్నిస్తోందనేది నిజం’’ అని జెలెన్‌స్కీ వ్యాఖ్యానించారు. మరోవైపు ఇజ్రాయెల్‌ విషాదంతో ప్రపంచం, అంతర్జాతీయ సంస్థలు ఉక్రెయిన్‌ సంక్షోభం గురించి పట్టించుకోట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఉక్రెయిన్‌, ఇజ్రాయెల్‌లో జరిగిన ఘటనలను నేను పోల్చడం లేదు. మా దేశంలో భీకరమైన యుద్ధం జరుగుతోంది. ఇజ్రాయెల్‌లో ఎంతో మంది వారి ప్రియమైన వారిని కోల్పోయారు. విషాద సంఘటనలు వేరైనా ఈ రెండు సమస్యలు చాలా తీవ్రమైనవి’’అని జెలెన్‌స్కీ చెప్పారు. ప్రపంచం ఉక్రెయిన్‌ను పట్టించుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. ఉక్రెయిన్‌ భవితవ్యం ప్రపంచ ఐక్యతపై ఆధారపడి ఉందని, ప్రపంచ ఐక్యత అమెరికా ఐక్యతపై ఆధారపడి ఉందని తెలిపారు. 

ఉక్రెయిన్‌లో జరుగుతోన్న యుద్ధం గురించి జెలెన్‌స్కీ మాట్లాడుతూ.. రష్యా ఆక్రమించిన ప్రాంతాలకు విముక్తి కల్పించేందుకు సైన్యం పోరాటం చేస్తోందని చెప్పారు. రష్యా బలమైన నెట్‌వర్క్‌ కారణంగా సైన్యానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నా మంచి ఫలితాలు సాధిస్తోందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని