Ukraine: ఉక్రెయిన్‌పై తొలిసారి జిర్కాన్‌ క్షిపణిని ప్రయోగించిన రష్యా..

రష్యా తొలిసారి తన అజేయ అస్త్రాన్ని ఉక్రెయిన్‌పై ప్రయోగించింది. ఇది రెప్పపాటు కాలంలో కీవ్‌లోని లక్ష్యాన్ని ధ్వంసం చేసింది. 

Updated : 13 Feb 2024 14:46 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రష్యా (Russia) తన అమ్ములపొదిలోని అత్యాధునిక అస్త్రాన్ని ఉక్రెయిన్‌(Ukraine)పై ప్రయోగించింది. ఈ విషయాన్ని మాస్కో బహిర్గతం చేయకపోయినా.. కీవ్‌ ఫోరెన్సిక్‌ పరిశోధనా సంస్థ బృందం గుర్తించింది. ఫిబ్రవరి 7వ తేదీన కీవ్‌పై జరిగిన ఒక దాడిలో జిర్కాన్‌ హైపర్‌సోనిక్‌ క్రూజ్‌ క్షిపణిని వాడినట్లు ఆ బృందం వెల్లడించింది. ‘‘సేకరించిన శకలాలు, విడిభాగాల ముక్కలు, దాడి జరిగిన తీరు ఆధారంగా ఇది ఏమిటో గుర్తించాము. యుద్ధంలో తొలిసారి రష్యా జిర్కాన్‌ను ప్రయోగించింది’’ అని ఆ సంస్థ ప్రకటించింది. కాకపోతే దీనిని ఎక్కడి నుంచి ప్రయోగించారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఇప్పటికే మాస్కో నుంచి నిత్యం జరుగుతున్న  దాడులతో కీవ్‌ గగనతల రక్షణ వ్యవస్థ పూర్తిగా అలసిపోయింది. తాజాగా రష్యా జిర్కాన్‌ క్షిపణుల వినియోగం ప్రారంభించడంతో.. ఉక్రెయిన్‌ సమస్యలు మరింత పెరిగినట్లైంది. 

ఒక్కసారి ఈ క్షిపణి గాల్లోకి ఎగరడం మొదలుపెడితే దానిని ప్రపంచంలోని ఏ అత్యున్నత గగనతల రక్షణ వ్యవస్థ అడ్డుకోలేదు. అమెరికాకు చెందిన మిసైల్‌ డిఫెన్స్‌ అడ్వొకసి అలయన్స్‌ అంచనా ప్రకారం ఈ క్షిపణి గంటకు 9,900 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ‘‘వారు చెప్పిన సమాచారం నిజమైతే.. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన క్షిపణి జిర్కాన్‌. దానిని అడ్డుకోవడం అసాధ్యం. ఈ క్షిపణి ప్రయాణించే సమయంలో వేగానికి చుట్టూ ప్లాస్మా మేఘంతో వలయం ఏర్పడుతుంది. గగనతల రక్షణ వ్యవస్థల నుంచి వచ్చే రాడార్‌ సంకేతాలను అది తనలో కలిపేసుకొని ప్రతిఫలించనివ్వదు. దీంతో ఈ క్షిపణిని గుర్తించలేం’’ అని ఆ సంస్థ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.  

అమెరికా అధ్యక్ష బాధ్యతలకు సిద్ధమే: కమలా హారిస్ వెల్లడి

అమెరికాకు చెందిన ‘ఏజిస్‌ క్షిపణి రక్షణ వ్యవస్థ’కు శత్రు అస్త్రాలను నేలకూల్చడానికి 8-10 సెకన్ల సమయం అవసరం. ఇంత స్వల్ప వ్యవధిలో జిర్కాన్‌ 20 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అందువల్ల ఏజిస్‌ క్షిపణికి కూడా అది అందదని రష్యా నిపుణులు చెబుతున్నారు. గతేడాది జనవరిలో జరిగిన ఓ కార్యక్రమంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మాట్లాడుతూ తమ దేశాన్ని విదేశీ శక్తుల నుంచి కాపాడటానికి జిర్కాన్‌ ఓ నమ్మదగిన ఆయుధమన్నారు. మెరుపు వేగంతో అమెరికా విమానవాహక నౌకలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా రష్యా దీనిని అభివృద్ధి చేసినట్లు నిపుణులు భావిస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని