Wikipedia: రష్యా దురాక్రమణపై వ్యాసం.. వికీపీడియాకు రూ.20లక్షల ఫైన్‌

ఉక్రెయిన్‌ యుద్ధానికి (Ukraine Crisis) సంబంధించి రష్యా వ్యతిరేక వ్యాసాలు ప్రచురించారన్న ఆరోపణలపై వికీపీడియాకు (WIkipedia) భారీ జరిమానా పడింది.

Published : 14 Apr 2023 20:21 IST

మాస్కో: ఉక్రెయిన్‌పై రష్యా చేస్తోన్న దురాక్రమణకు (Russia Invasion) సంబంధించిన విషయాలను అక్కడి ప్రభుత్వం ప్రజలకు తెలియనీయకుండా ప్రయత్నాలు చేస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా యుద్ధానికి సంబంధించి రష్యా వ్యతిరేక, విమర్శనాత్మక కథనాలపై పుతిన్‌ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని పలు నివేదికలు చెబుతున్నాయి. ఈ క్రమంలో వికీపీడియాకు (WIkipedia) మాస్కో న్యాయస్థానం భారీ జరిమానా విధించింది. రష్యాకు వ్యతిరేకంగా ప్రచురితమైన ఓ వ్యాసాన్ని తొలగించనందుకుగానూ 2మిలియన్‌ రుబుల్స్‌ (సుమారు రూ.20లక్షలు) ఫైన్‌ వేసింది.

జపోరిజియా ప్రాంతాన్ని రష్యా ఆక్రమించుకోవడంపై వికీపీడియాలో ఇటీవల ఓ వ్యాసం ప్రచురితమైంది. దీనిపై రష్యా ప్రభుత్వ సమాచార విభాగం అభ్యంతరం తెలిపింది. అది తప్పుడు సమాచారమని.. దాన్ని వెంటనే తొలగించాలని డిమాండు చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అయితే, ఇది అస్పష్టమైన డిమాండని పేర్కొన్న వికీపీడియా తరఫు ప్రతినిధి.. దానిని తోసిపుచ్చాలని కోర్టుకు విన్నవించారు. ఇరుపక్షాల వాదనలు విన్న మాస్కో న్యాయస్థానం వికీపీడియాకు 2 మిలియన్‌ రుబుల్స్‌ జరిమానా విధించింది.

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం వ్యవహారంలో వికీపీడియాకు జరిమానా పడటం ఇదే తొలిసారి కాదు. కొన్నిరోజుల క్రితం కూడా సైకియా అనే రష్యా రాక్‌బ్యాండ్‌ పాటను తొలగించనందుకు 8లక్షల రుబుల్స్‌ జరిమానా పడింది. అంతేకాకుండా రష్యా ‘ప్రత్యేక సైనిక చర్య’లో భాగంగా బుచా, మేరియుపోల్‌ విధ్వంసం గురించి రాసిన వ్యాసాలపైనా వికీపీడియాకు 2022 నవంబర్‌లో 2మిలియన్‌ రుబుల్స్‌ ఫైన్‌ పడింది. వీటిపై స్పందించిన వికీమీడియా న్యాయవిభాగం ప్రతినిధి లైగనా మిక్స్‌టర్‌.. ఈ వ్యాసాలను తొలగించే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. పూర్తి ధ్రువీకరణ తర్వాతే వాటిని ప్రచురించామని, ఈ తీర్పులను న్యాయస్థానాల్లో సవాలు చేస్తామని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు